న్యూయార్క్: భారత సంతతికి చెందిన అమెరికన్ రాజీవ్ జోషికి ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం దక్కింది.  ఎలక్ట్రానిక్, కృత్రిమ మేధ రంగాల్లో సేవలు అందించినందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.రాజీవ్ జోషీ న్యూయార్క్ లోని ఐబీఎం థామ్సన్ వాట్సన్ రీసెర్చ్ సెంటర్ లో ఆయన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు.

ఐఐటీ ముంబైలో  ఇంజనీరింగ్ పూర్తి చేసిన జోషీ మసాచుసెట్స్  ఆఫ్ టెక్నాలజీ నుండి ఆయన ఎంఎస్ పట్టా పొందాడు.  అనంతరం ఆయన కొలంబియా విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పూర్తి చేశాడు. ప్రాసెసర్లు, సూపర్ కంప్యూటర్లు, ల్యాప్ టాప్, స్మార్ట్‌ఫోన్, అత్యాధునిక గ్యాడ్జెట్లలో వాడే అనేక పరికరాలను ఆయన ఆవిష్కరించారు.

రాజీవ్ జోషీ ఆవిష్కరణలు కృత్రిమ మేథ, హెల్త్ కేర్ రంగాలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. దీంతో న్యూయార్క్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా అసోసియేషన్ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

సమస్యల్ని గుర్తించి వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటానని రాజీవ్ జోషి చెప్పారు. భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేథ, క్లౌడ్ సాంకేతికత  వినియోగం విస్తృతం కానుందని  తెలిపారు.