అదృష్టం కొందరికే తలుపు తిడుతుంది. ఆ తలుపు కొట్టినప్పుడే తియాలి..లేదంటే మళ్లీ అవకాశం రాకపోవచ్చు. కాగా.. ఓ వ్యక్తి అనుకోకుండా అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. కానీ.. దానిని దక్కించుకునే క్రమంలో.. దురదృష్టం తిష్టవేసింది. అర్థం కాలేదా..? ఓ వ్యక్తికి లాటరీలో దాదాపు రూ.4కోట్లు గెలుచుకున్నాడు. కానీ.. దానిని అతనికి ఇద్దామంటే.. అతని కాంటాక్ట్ కూడా దొరకడం లేదు. ఈ సంఘటన అబుధాబిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బిగ్ టికెట్ రాఫెల్‌లో 20 మిలియన్ దిర్హమ్స్ గెలిచాడో భారతీయుడు. కానీ, తన కాంటాక్ట్ నెంబర్ తప్పుగా ఇవ్వడంతో ప్రస్తుతం అతనిని చేరుకోవడం కష్టంగా ఉందని నిర్వహకులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్‌వీ అబ్దుసలామ్ అనే భారత వ్యక్తి ఆదివారం తీసిన అబుధాబి బిగ్ టికెట్ డ్రాలో విజేతగా నిలిచాడు. ఈ ఏడాదిలో ఆయనే తొలి విన్నర్ కూడా. అతను ఏకంగా 20 మిలియన్ దిర్హమ్స్(రూ.3,97,97,544) గెలుచుకున్నాడు. 

డిసెంబర్ 29న అబ్దుసలామ్ కొన్న లాటరీ టికెట్ నెం.323601కు ఈ జాక్‌పాట్ తగిలింది. దీంతో అతను టికెట్ కొనుగోలు చేసిన సమయంలో ఇచ్చిన రెండు మొబైల్ నెంబర్ల ద్వారా నిర్వహకులు అతడ్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ, అందులో ఒకటి రాంగ్ నెంబర్ అని వస్తే.. రెండోది ప్రస్తుతం అందుబాటులో లేదని వస్తోందట. కాగా, అబ్దుసలామ్ కేరళ వ్యక్తి అని, అతను ఎవరికైనా తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అక్కడి మలయాళీ కమ్యూనిటీని బిగ్ టికెట్ లాటరీ నిర్వహకులు కోరారు.