హ్యూస్టన్: అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో ఒక దుండగుడు దారుణానికి ఒడిగట్టాడు. భారత సంతతికి చెందిన పోలీస్ అధికారి సందీప్ సింగ్ దలివాల్ ను అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశాడు. 

వివరాల్లోకి వెళితే హ్యూస్టన్ నగరంలో పోలీస్ అధికారిగా సందీప్ సింగ్ దలివాల్ గత 10సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నాడు. ఇంతలో ఓ కారులో వచ్చిన ఒక జంటను సంబంధించిన పత్రాలు చూపించాలని కోరగా కోపోద్రక్తుడైన సదరు వ్యక్తి తన తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. 

కాల్పులు జరిపి ఈ వ్యక్తి పక్కనేవున్న షాపింగ్ మాల్ వైపుగా పరుగు తీసాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ సందీప్ సింగ్ అక్కడికక్కడే మృతుచెందాడు. కాల్పులు జరిపిన తుపాకిని, కారును, అతనితోపాటు ప్రయాణించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సింగ్ ఎప్పుడుకూడా తలపాగా ధరించే ఉండేవాడని, సిక్కు సాంప్రదాయాలను, ఆచారాలను, కట్టుబాట్లను ఎల్లప్పుడూ పాటించేవాడని తోటి అధికారులు చెబుతున్నారు. 

మొన్ననే మన ప్రధాని నరేంద్ర మోడీ హ్యూస్టన్ వేదికగా హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొని వారం కూడా గడవక ముందే ఈ దారుణం చోటు చేసుకోవడంతో భారత సంతతి ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు.