పాకిస్తాన్‌కు చెందిన టెర్రరిస్టును గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించాలని భారత్, అమెరికా సంయుక్తంగా ఐరాసలో ప్రతిపాదించింది. కానీ, చివరి నిమిషంలో చైనా ఈ ప్రతిపానను అడ్డుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

న్యూఢిల్లీ: ఐరాసలో పాకిస్తాన్ టెర్రరిస్టుపై ఆంక్షలు విధించడానికి చేసిన ప్రయత్నాలపై చైనా నీళ్లు పోసింది. పాకిస్తాన్‌కు చెందిన టెర్రరిస్టు అబ్దుల్ రెహ్మన్ మక్కిని గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించాలని భారత్, అమెరికాలు సంయుక్తంగా ప్రతిపాదన చేశాయి. కానీ, ఇందుకు చైనా చివరి నిమిషంలో మోకాలడ్డింది. ఐక్య రాజ్య సమితిలో భద్రతా మండలికి చెందిన ఐఎస్ఐఎస్, అల్ ఖైదా శాంక్షన్స్ కమిటీ పరిధిలోని గ్లోబల్ టెర్రరిస్టు లిస్టులో అబ్దుల్ రెహ్మన్ మక్కిని చేర్చాలని భారత్, అమెరికా భావించాయి.

మక్కి అమెరికా గుర్తించిన టెర్రరిస్టు. లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు బంధువు. ముంబయిలో విధ్వంసం సృష్టించిన 26/11 దాడుల వెనుక మాస్టర్ మైడ్ హఫీజ్ సయీద్ అని తెలిసిందే.

1267 ఐఎస్ఐఎస్, అల్ ఖైదా శాంక్షన్స్ కమిటీ పరిధిలోని గ్లోబల్ టెర్రరిస్టు జాబితాలో అబ్దుల్ రెహ్మన్ మక్కిని చేర్చాలని భారత్, అమెరికా సంయుక్తంగా ప్రతిపాదించినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కానీ, చివరి నిమిషంలో ఈ ప్రతిపాదనకు చైనా అడ్డు చెప్పినట్టు తెలిసింది.

గతంలోనూ చైనా ఇలాంటి ప్రతిపాదనలకు మోకాలడ్డింది. పాకిస్తాన్‌కు చెందిన టెర్రరిస్టులను ఈ జాబితాలో చేర్చాలని, భారత్, మిత్ర దేశాలు కలిసి పలుమార్లు చేసిన ప్రయత్నాలను చైనా ఇలాగే అడ్డుకుంది.

కానీ, 2019లో భారత అద్భుత దౌత్య విజయాన్ని ఐరాసలో సొంతం చేసుకుంది. అప్పుడు చైనా ప్రయత్నాలనూ తిప్పికొడుతూ.. జాషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను గ్లోబల్ టెర్రరిస్టు జాబితాలో భారత్ చేర్పించగలిగింది. సుమారు దశాబ్దం తర్వాత భారత్ తొలిసారి ఈ విషయంపై ఐరాసను ఆశ్రయించింది. విజయం సాధించింది. 

2009లో తొలిసారి భారత్ మసూద్ అజహర్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించాలని స్వయంగా ప్రతిపాదన చేసింది. 2016లోనూ ఇదే ప్రతిపాదనను యూఎస్, యూకే, ఫ్రాన్స్‌లతో కలిసి చేపట్టింది. 2017లోనూ ఇదే దేశాలతో సంయుక్తంగా ప్రతిపాదించింది. కానీ, అన్ని సార్లు చైనా ఈ ప్రతిపాదనలను అడ్డుకుంది. అయితే, మసూద్ అజహర్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించాలని అంతర్జాతీయంగా ఒత్తిళ్లు రావడంతో ఫ్రాన్స్, యూకేల మద్దతుతో అమెరికా ఓ డ్రాఫ్ట్ రిజల్యూషన్‌ను ప్రవేశపెట్టింది. తద్వార ఐరాస భద్రతా మండలి నేరుగా మసూద్ అజహర్‌ను బ్లాక్ లిస్టులో చేర్చింది.