Asianet News TeluguAsianet News Telugu

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం: ఇమ్రాన్ ఖాన్ నైరాశ్యం, మోడీపై అక్కసు

పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ అసెంబ్లీలో పాకిస్తాన్ ను ఉద్దేశిస్తూ ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించాడు. ఈ ప్రసంగం పూర్తిగా వింటే ఇమ్రాన్ ఖాన్ నైరాశ్యం మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. 

Imran Khan's Independence day speech decoded: Nothing but depseration
Author
Islamabad, First Published Aug 15, 2019, 3:07 PM IST

ఇస్లామాబాద్: భారత దేశం నేడు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుండగా పాకిస్థాన్ నిన్న ఆగష్టు 14వ తేదీన జరుపుకుంది. ఇరు దేశాలకు స్వాతంత్రం ఒకేసారి వచ్చినప్పటికీ వారుమాత్రం 1947నుండి కూడా ఆగష్టు 14వ తేదినే జరుపుకుంటున్నారు. నిన్న పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ అసెంబ్లీలో పాకిస్తాన్ ను ఉద్దేశిస్తూ ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించాడు. ఈ ప్రసంగం పూర్తిగా వింటే ఇమ్రాన్ ఖాన్ నైరాశ్యం మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. తను ప్రధానిగా ఎన్నికైన నాటినుండి ఒక్కసారి కూడా ఈ ప్రాంతానికి రానివాడు స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం చేయడానికి వచ్చాడంటేనే అతని పరిస్థితిని మనము అర్థం చేసుకోవచ్చు. 

ఏదైతే కాశ్మీర్ ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్ ఆధీనంలో ఉందో దాన్నే మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా వ్యవహరిస్తాము. దీన్నే పాక్, ఆజాద్ కాశ్మీర్ గా పిలుస్తుంది. అర్థం పర్థం లేని మాటలతో, తలా తోకా లేని పోలికలతో ఎం మాట్లాడుతున్నాడో స్థిమితం కోల్పోయి మాట్లాడాడు ఇమ్రాన్ ఖాన్. ఒక రకంగా చెప్పాలంటే పూర్తి ప్రసంగమే హాస్యాస్పదంగా ఉంది. ఈ ప్రసంగంలో భారతదేశం కన్నా మోడీపైనే ఎక్కువ కోపాన్ని ప్రదర్శించాడు ఇమ్రాన్ ఖాన్. 

తన ప్రసంగంలో భారతదేశంపైన పదే పదే విమర్శలు చేసాడు. వాటి విషయానికి వస్తే, భారతదేశం ప్రతిపక్షం గొంతు నొక్కుతుంది అని అన్నాడు. వాస్తవానికి ప్రతిపక్షం మాట్లాడలేకపోవడం వారి అసమర్థత. పార్లమెంటులో విపక్షాలు మాట్లాడడం మనం చూసాము. భారతదేశంవైపు వేలెత్తి చూపెట్టేముందు ఇమ్రాన్ ఖాన్  చేసిందేమిటో ప్రపంచానికి తెలియంది కాదు. ప్రతిపక్షాలకు చెందిన అందరినీ జైళ్లలో పెట్టాడు. నవాజ్ షరీఫ్ నుంచి మొదలుకొని అసిఫ్ అలీ జర్దారీ వరకు అందరినీ జైలుపాలు చేసాడు. చివరకు వారి కుటుంబసభ్యులను కూడా వదల్లేదు. ఒక వారం కిందటే నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ ను కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అసిఫ్ అలీ జర్దారీ సోదరిని కూడా జైల్లో పెట్టారు. జైల్లో లేని బ్రతికున్న ఏకైక మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మాత్రమే. దానికి కారణం అతను విదేశాల్లో ప్రవాస జీవితం గడుపుతూ ఉండడం. 

మరో విమర్శ ఏంటంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తున్నారు అని. దీని గురించి అసలు ఆలోచించే ముందు పాకిస్తాన్ లో ప్రస్తుత న్యాయ వ్యవస్థ పరిస్థితిని ఒకసారి చూద్దాం. కీలక కేసుల్లో తీర్పులు చెప్పబోయే జడ్జిలను ఐ ఎస్ ఐ బెదిరిస్తోంది. తమకు అనుకూలంగా మాత్రమే తీర్పు చెప్పాలి. లేనిపక్షంలో వారి ప్రాణాలు గాల్లో కలిసినట్టే, దీనికి సంబంధించి అనేక వీడియోలు ఆన్ లైన్ లోన్ ప్రత్యక్షమైన విషయం మనందరికి సుపరిచితమే. అక్కడ న్యాయస్థానాలు ప్రభుత్వానికి మిలటరీకి రబ్బర్ స్టాంపుల్లా తయారయ్యాయి. 

తమ దేశంలో వ్యవస్థలను తాము ఎలా బ్రష్టు పట్టిస్తున్నారో ప్రపంచమంతా కూడా అలానే చేస్తుందని ఇమ్రాన్ ఖాన్ భావించడం సిగ్గుచేటు. మరో విషయమేంటంటే, ప్రపంచంలోని ముస్లిములు కాశ్మీర్ విషయంలో భారత వైఖరిని సహించబోరని అన్నాడు. ముఖేష్ అంబానీకి చెందిన సంస్థలో 20% వాటాను కొనడానికి సౌదీ కంపెనీ ముందుకు వచ్చిందంటేనే భారత వైఖరిని సౌదీ వంటి ముస్లిం దేశం సమర్థించిందని అర్థం. ఈ అతి సాధారణ విషయాలను కూడా విస్మరిస్తూ సాగింది ఇమ్రాన్ ప్రసంగం. 

పాకిస్తాన్ సైన్యం గురించి ప్రస్తావిస్తూ, వారు ఏదో కాలక్షేపం చేసే సైన్యం కాదని, 30 సంవత్సరాలుగా యుద్ధంలో మరణించిన సైనికుల శవాలను మోస్తున్నారని అన్నాడు. దీని అర్థం ఏమైనప్పటికీ, పాకిస్తాన్ సైనికులు భారీ సంఖ్యలో మరణిస్తున్నారనే వాస్తవాన్ని మాత్రం అంగీకరించాడు. ఈ మరణాలు భారత దాడుల వల్ల సంభవించినవా లేక పాక్ పశ్చిమ దిశలో కొనసాగుతున్న గిరిజన గెరిల్లా దాడుల వల్లనా అనేది మాత్రం చెప్పలేదు. ఎల్ ఓ సి వెంబడి అంత భారీ స్థాయి కాల్పులు యుద్ధ సమయంలో తప్పిస్తే మామూలు సందర్భాల్లో అరాకొరా మాత్రమే. కాబట్టి బలూచిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ కు తలనొప్పులు ఎక్కువయ్యాయనే విషయం అర్థమవుతుంది. 

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆజాద్ కాశ్మీర్ గా పాక్ పేర్కొనడమే భారత్, పాక్ ల విభజన చట్టాలకు విరుద్ధం. కాశ్మీర్ ప్రజలకు కేవలం రెండు ఆప్షన్లను మాత్రమే ఇవ్వడం జరిగింది. ఐతేనేమో పాకిస్తాన్ తో కలవడం లేదా భారత్ లో విలీనమవ్వడం. అంతే తప్ప స్వతంత్రంగా ఉండే హక్కు వారికి ఇవ్వలేదు. ఇమ్రాన్ ఖాన్ తరచూ మాట్లాడే ఐక్యరాజ్యసమితి రిజల్యూషనులో కూడా వారికి కేవలం ఈ రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ ఇలా తప్పుడు ప్రచారాన్ని చేస్తూ అక్కడి ప్రజలను తప్పుదోవ పట్టించడం ఎంత త్వరగా ఆపితే అంత మంచిది. 

ఇదమిత్థంగా, ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం తలా తోకా లేకుండా, వాస్తవాలను కప్పిపుచ్చుతూ అసంబద్ధంగా, అభూతకల్పనలతో అసంపూర్ణంగా ముగిసింది. దీన్ని విన్న తరువాత కోపం కన్నా నవ్వు వస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios