Asianet News TeluguAsianet News Telugu

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు రద్దు.. సుప్రీంకోర్టుపై పాకిస్థాన్ ప్రభుత్వ ఆగ్రహం.. మళ్లీ అరెస్టు చేస్తామంటూ వ్యాఖ్యలు

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు చెల్లదని అత్యున్నత న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. అనుమతి లేకుండా ఎవరినీ అరెస్టు చేయలేమని, ఈ చట్టం భయం, బెదిరింపులు లేకుండా న్యాయం పొందడానికి నిరాకరిస్తుందని, ఇది ప్రతి పౌరుడి హక్కు అని కోర్టు అభిప్రాయపడింది.

Imran Khan's arrest cancelled.. Pakistan government's anger on Supreme Court.. Comments that they will arrest again..ISR
Author
First Published May 12, 2023, 2:09 PM IST

Imran Khans arrest: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చెల్లదని పేర్కొంటూ ఆయన విడుదలకు మార్గం సుగమం చేసిన ఆ దేశ సుప్రీంకోర్టుపై అక్కడి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఇమ్రాన్ ఖాన్ ను నిర్బంధం నుంచి విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాన్ని తప్పుబట్టింది. అతడిని మళ్లీ అరెస్టు చేస్తామని అంతర్గత మంత్రి రాణా సనావుల్లా ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు సైనిక, ప్రభుత్వ ఆస్తులపై దాడులను అత్యున్నత న్యాయస్థానం విస్మరిస్తోందని రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ ఆరోపించారు.

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు చెల్లదని అత్యున్నత న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. అనుమతి లేకుండా ఎవరినీ అరెస్టు చేయలేమని, ఈ చట్టం భయం, బెదిరింపులు లేకుండా న్యాయం పొందడానికి నిరాకరిస్తుందని, ఇది ప్రతి పౌరుడి హక్కు అని కోర్టు అభిప్రాయపడింది.

అవినీతి కేసు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన 70 ఏళ్ల మాజీ క్రికెటర్, మాజీ ప్రధానిని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) ఆదేశాల మేరకు పారామిలిటరీ రేంజర్లు మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు గదిలోకి చొరబడి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చీఫ్ అరెస్టు చట్టబద్ధమేనని, కానీ అది జరిగిన తీరు చట్టవిరుద్ధమని మరుసటి రోజు కోర్టు వ్యాఖ్యానించింది. ఇస్లామాబాద్ పోలీసు చీఫ్, అంతర్గత కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాగా.. గురువారం ఆయన అరెస్టు చెల్లదని, విడుదల చేయాలని పేర్కొంది.

ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు అనంతరం పీటీఐ మద్దతుదారులు దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి పాకిస్థాన్ లోని పలు నగరాల్లో హింసాత్మక నిరసనలకు దిగారు. అతడి మద్దతుదారులు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ సహా భద్రతా సంస్థల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని లాఠీలతో దాడి చేశారు. పంజాబ్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని ప్రధాన ప్రాంతాల్లో గుమిగూడడాన్ని నిషేధిస్తూ పోలీసులు సెక్షన్ 144 విధించినా కూడా.. దానిని ఆందోళనకారులు పట్టించుకోలేదు.

అయితే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోర్టు విచారణకు హాజరయ్యే నేపథ్యంలో.. ఆయన మద్దతుదారులు శుక్రవారం రాజధానికి ర్యాలీగా వెళ్లే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. సమావేశాలపై నిషేధం విధిస్తూ ఎమర్జెన్సీ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో డాలర్ తో పాకిస్థాన్ రూపాయి మారకం విలువ గురువారం సరికొత్త కనిష్టానికి పడిపోయింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కు ఇది మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేసే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios