Imran Khan: పాకిస్థాన్ లో గత నెల రోజులుగా సాగుతున్న రాజకీయ అస్తిరతకు నేటీతో తెరపడింది. పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానమే గెలువడంతో ఇమ్రాన్‌ఖాన్ సర్కారు కూలిపోయింది.
Imran Khan: పాకిస్థాన్‌లో గత నెల రోజులుగా సాగుతున్న రాజకీయ అస్థిరతకు తెరపడింది. శనివారం అనేక వాయిదాల మధ్య జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఓటమి పాలై.. పదవీచ్యుతుడయ్యాడు ప్రధాని ఇమ్రాన్ ఖాన్. దీంతో ఇమ్రాన్‌ఖాన్ సర్కారు కూలిపోయింది. పాకిస్థాన్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించబడిన తొలి ప్రధానిగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిలిచారు. అవిశ్వాసంపై ఆదివారం తెల్లవారుఝామున జరిగిన ఓటింగ్‌లో విపక్షాలు ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి.
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులు ఉన్నారు. మెజార్టీకి రావాలంటే.. 172 మంది మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇమ్రాన్ సర్కార్‌కు వ్యతిరేకంగా 174 ఓట్లు వచ్చినట్లు జాతీయ అసెంబ్లీ స్పీకర్ ఆయాజ్ సాదిఖ్ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం సందర్బంగా.. అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్ అన్నట్టుగానే చివరి బంతి వరకూ ఆడాడు.
ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం తిరస్కరణపై డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి ఇచ్చిన తీర్పును పాకిస్థాన్ సుప్రీంకోర్టు గురువారం ఏకగ్రీవంగా కొట్టివేసిన నేపథ్యంలో అవిశ్వాసం ఓటింగ్ తప్పనిసరి అయింది. పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ వైదొలగడంతో.. దేశ తదుపరి ప్రధానిగా ప్రతిపక్ష నేత, పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్ (పీఎంఎల్-ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్‌కు రంగం సిద్ధమైంది. కొత్త ప్రధానిని అధికారికంగా ఎన్నుకునేందుకు జాతీయ అసెంబ్లీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశం కానున్నది.
నాటకీయంగా అవిశ్వాసం
అవిశ్వాస తీర్మానం కోసం జాతీయ అసెంబ్లీ శనివారం ఉదయం 10.30 గంటలకు సమావేశమైంది, అయితే.. ఈ ప్రక్రియ చాలాసార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుకున్నాయి. శనివారం అర్ధరాత్రి 12 గంటల్లోగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్న సుప్రీంకోర్టు తీర్పుకు ఆయన తిలోదకాలిచ్చారు. అర్ధరాత్రి 12 కావడానికి 25 నిమిషాల ముందు.. అనూహ్యంగా పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైసర్‌తో పాటు డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ రాజీనామా చేశారు. దీంతో అందరూ డైలామాలో పడ్డారు. అయితే అప్పటికప్పుడు అయాజ్ సాదిఖ్‌ను యాక్టింగ్ స్పీకర్‌గా ఎన్నుకొని అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. శనివారం రాత్రి 11.58 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ అర్ధరాత్రి దాటింది.
ఓటింగ్ సమయంలో ఇమ్రాన్ ఖాన్ గైర్హాజరు కాగా.. ఆయన పార్టీ శాసనసభ్యులు వాకౌట్ చేశారు. 342 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీలో 174 మంది శాసనసభ్యులు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాస ఓటు చివరకు ఆమోదించబడింది.
అవిశ్వాసం ముందే.. అధికారం నివాసం ఖాళీ..
జాతీయ అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ ఓడిపోవడానికి ముందే, ప్రధాని అధికార నివాసం నుంచి ఖాళీ అయ్యారు. విపక్షాలు సంతోషించగా, ఇమ్రాన్ మద్దతుదారులు నిరసనకు దిగారు. అవిశ్వాస తీర్మానం ముగిసిన తర్వాత, విపక్ష నేతలు జాతీయ అసెంబ్లీలో షెహబాజ్ షరీఫ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త పాలనలో ప్రతీకార రాజకీయాలకు ఉండవని ప్రతిజ్ఞ చేశారు PML-N చీఫ్ . అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించినందుకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ కూడా అసెంబ్లీని అభినందించారు. ఇంతలో.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) కార్యకర్తలు నేషనల్ అసెంబ్లీ వెలుపలికి వచ్చి నిరసనకు దిగారు.
అవిశ్వాసం వల్ల వైదొలిగిన తొలి ప్రధాని
గతంలో రెండు సార్లు పాకిస్తాన్ ప్రధానులపై అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. కానీ అవి వీగిపోయాయి.తొలుత 1989లో బెనర్జీ భుట్టోపై అవిశ్వాస తీర్మానం పెట్టగా ఆమె 12 ఓట్ల తేడాతో నెగ్గారు. 2006లో ప్రధాని షౌకాత్ అజీజ్ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఓడించారు. విశ్వాస పరీక్షను ఎదుర్కొన్న ప్రధానుల్లో ఇమ్రాన్ ఖాన్ మూడో వ్యక్తి. ఈ తీర్మానంలో ఓడిపోవడంతో తొలి సారి అవిశ్వాసంలో ఓడిపోయిన ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నిలిచారు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ రాజకీయ చరిత్రలో ఏ ప్రధాని కూడా పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు.
