Asianet News TeluguAsianet News Telugu

గేదెలను వేలానికి పెట్టిన పాక్ ప్రధాని ఇమ్రాన్

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నపాకిస్థాన్‌ ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అన్నిరంగాల్లో కోతలు విధించిన ఇమ్రాన్‌ ఖాన్‌ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నివాసంలోని ఎనిమిది గేదెలను గురువారం వేలం వేశారు ప్రధాని ఇమ్రాన్ ఖాన్. 

Imran Khan government to auction 8 buffaloes
Author
Islamabad, First Published Sep 27, 2018, 7:07 PM IST

ఇస్లామాబాద్‌: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నపాకిస్థాన్‌ ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అన్నిరంగాల్లో కోతలు విధించిన ఇమ్రాన్‌ ఖాన్‌ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నివాసంలోని ఎనిమిది గేదెలను గురువారం వేలం వేశారు ప్రధాని ఇమ్రాన్ ఖాన్. 

ఎనిమిది గేదెలను వేలం వేయడం ద్వారా రూ.23 లక్షలు సేకరించారు. ఎనిమిది గేదెల్లో ఓ గేదె అత్యధికంగా రూ.3,85,000లకు అమ్ముడు పోయింది. మిగిలిన గేదెలను ఇమ్రాన్‌ సొంత పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ-ఇన్సాఫ్‌ కార్యకర్తలు కొనుగోలు చేశారు. 

30లక్షల కోట్ల అప్పుతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ను గట్టెక్కించే ప్రయత్నంలో భాగంగా మొత్తం 102 లగ్జరీ వాహనాలను వేలం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తొలివిడతగా సెప్టెంబర్ 17న 34 కార్లను విక్రయించారు. రెండో దశ కింద 41 ఇంపోర్టెడ్‌ కార్లను త్వరలోనే వేలానికి పెట్టనున్నట్లు పాక్ సర్కార్ తెలిపింది. వేలానికి సంబంధించిన వాహనాల్లో మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లు, బుల్లెట్‌ ప్రూఫ్‌ బీఎండబ్ల్యూలు, టయోటా, లెక్సస్‌, సుజుకీ, హోండా కార్లు, జీపులు ఉన్నాయి.

 పాక్ ఆర్థిక వ్యవస్థలో 87 శాతం అప్పు ఉండటంతో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ ఖర్చుల నియంత్రణపై దృష్టిసారించారు. అందులో భాగంగా తొలుత తనకు కేటాయించిన సిబ్బంది సంఖ్యను తగ్గించుకున్నారు. 

ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అధ్యక్షుడు, ప్రధానమంత్రి, స్పీకర్‌, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా వీవీఐపీలందరూ బిజినెస్‌ క్లాస్‌లోనే ప్రయాణించాలని ఆదేశించారు. ప్రభుత్వం వద్ద నిరుపయోగంగా పడి ఉన్న నాలుగు హెలికాప్టర్లను కూడా విక్రయించేందుకు సిద్ధమయ్యారు.

అంతేకాదు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇప్పటికే ప్రయాణ ఖర్చుల్లో కోత విధించిన ఇమ్రాన్ సర్కార్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అధికారులతో, మంత్రులతో, ప్రజా ప్రతినిధులతో నిర్వహించే సమావేశాల్లో ఇకపై భోజనాలను రద్దు చేసి దాని స్థానంలో బిస్కెట్లను మాత్రమే అందించాలని ఆదేశించారు. విదేశీయులతో జరిగే సమావేశాలకు ఇది వర్తించదన్నారు. 

అంతర్గతంగా జరిగే సమావేశాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. కార్లు, గేదెలు, హెలికాప్టర్లు మాత్రమే కాదు నిరుపయోగంగా ఉన్న ప్రధాని అధికారిక నివాసాలను సైతం వేలం వేయబోతున్నట్లు ప్రకటించింది ఇమ్రాన్ సర్కార్. 

ఇమ్రాన్ పొదుపు మంత్రంపై అటు అధికారులు, ఇటుప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంట్లోని పశువులను కూడా అమ్మకానికి పెట్టడంతో ప్రతిపక్షాలు ఇమ్రాన్‌ ఖాన్‌పై విరుచుకుపడుతున్నాయి. పొదుపు మంత్రం పేరుతో పశువులను వేలానికి పెట్టి వచ్చిన డబ్బును ఇమ్రాన్‌ ఖాన్‌ తన విలాసాలకు ఖర్చు చేసుకుంటున్నారంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.

సెప్టెంబర్ 19న దుబాయ్ లో పర్యటించిన పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ లగ్జరీ ఫ్లైట్ లో ప్రయాణించడంపై పాకిస్థానీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొదుపు అంటే ఇదేనా అంటూ సెటైర్లు వేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios