Pakistan Floods: పాకిస్తాన్ లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఘోరమైన వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 1,396 కు చేరుకుందని పాకిస్తాన్ నివేదించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య 12,700ను దాటింది.
Pakistan Floods: పాకిస్థాన్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే పెను విషాదాన్ని నింపుతూ వేలాది మంది ప్రాణాలు బలిగొన్న వరదలు.. తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న భారీ వర్షాలు, వరదలతో పాటు ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దేశ ఆర్థిక వృద్ధి గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నాయి. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి దాని జీడీపీ వృద్ధి రేటును ఐదు శాతం నుండి మూడు శాతానికి తగ్గించవలసి వస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
నేషనల్ ఫ్లడ్ రెస్పాన్స్ అండ్ కోఆర్డినేషన్ సెంటర్ (NFRCC), మేజర్ జనరల్ జాఫర్ ఇక్బాల్, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌లకు సంయుక్త బ్రీఫింగ్ సందర్భంగా.. పాకిస్తాన్‌లో కనీసం మూడింట ఒక వంతు నీటమునిగిపోయిందనీ, ఆర్థిక నష్టం USD 30 బిలియన్లకు పైగా ఉంటుందని పేర్కొంది. వరదలు, IMF నిధుల ఆలస్యమైన ఆమోదం వంటి సంక్షోభాల పరిస్థితుల కారణంగా స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటులో పాకిస్థాన్ రెండు శాతం కోత పడుతుందని భావిస్తున్నట్లు ఇక్బాల్‌ని ఉటంకిస్తూ పాకిస్తాన్ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉద్భవిస్తున్న ఆర్థిక పరిస్థితులు కూడా ప్రభావం చూపాయని తెలిపింది.
2010లో 'సూపర్ ఫ్లడ్స్' దాదాపు 20 మిలియన్ల మందిని ప్రభావితం చేయగా, ప్రస్తుత ఆకస్మిక వరదల ప్రభావం దేశవ్యాప్తంగా 33 మిలియన్లకు పైగా ప్రజలు అనుభవించారని, అందులో 0.6 మిలియన్లకు పైగా ప్రజలు సహాయక శిబిరాల్లో ఉన్నారని మంత్రి చెప్పినట్లు డాన్ వార్తాపత్రిక నివేదించింది. విపత్తును ఎదుర్కోవడానికి సమర్థవంతమైన మౌలిక సదుపాయాల కొరత మధ్య మౌంటైన్ టోరెంట్స్ ఒక సవాలుగా నిరూపించబడ్డాయి. దీని ఫలితంగా మానవ జీవితం, మౌలిక సదుపాయాలు, పశువులు, పంటలకు భారీ నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు.
UN సహాయ సంస్థలతో సహా పౌర ప్రభుత్వం, సైనిక, NGOల మధ్య సమన్వయ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని NFRCC అధికారి తెలిపారు. సోమవారం నాటికి ప్రావిన్సులలో సహాయక చర్యలపై అంచనా సర్వే ప్రారంభమవుతుందన్నారు. ఇంతలో, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) నివేదిక ప్రకారం, ఘోరమైన వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 1,396 కు చేరుకుంది. మొత్తం గాయపడిన వారి సంఖ్య 12,700 పైగా ఉంది. అనేక మంది గల్లంతయ్యారు. NDMA తాజా పరిస్థితి నివేదిక ప్రకారం, వరదల కారణంగా దెబ్బతిన్న గృహాల సంఖ్య 1.7 మిలియన్లకు పైగా ఉంది. అలాగే, 6,600 కిలో మీటర్లకు పైగా రోడ్లు, 269 వంతెనలు దెబ్బతిన్నాయి. మొత్తం 81 జిల్లాలను(బలూచిస్థాన్‌లో 32, సింధ్‌లో 23, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 17) విపత్తు బాధిత జిల్లాలుగా పేర్కొనబడ్డాయి.
కాగా, తన రెండు రోజుల పాకిస్తాన్ పర్యటనలో చివరి రోజున ఉన్న UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సులలోని వరద బాధిత ప్రాంతాలను సందర్శించి కొనసాగుతున్న రెస్క్యూ, రిలీఫ్ ప్రయత్నాలు- వరద నష్టాలను సమీక్షిస్తారని సమాచారం.
