పుల్వామా ఉగ్రదాడి, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్టైక్స్, భారత వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ అటాక్ నేపథ్యంలో ప్రస్తుతం దాయాదుల మధ్య యుద్థ మేఘాలు కమ్ముకున్నాయి.

అయితే సంప్రదాయ తుపాకులు, ట్యాంకర్ల స్థానంలో అత్యాధునిక టెక్నాలజీతో పాటు అణ్వాయుధాలు యుద్ధంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్-పాక్‌ల మధ్య అణ్వాయుధాలుండటంతో ఎటు నుంచి దాడి జరిగినా రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు.

దీంతో యుద్ధం వద్దని రెండు దేశాల ప్రజలు కోరుతున్నారు. మరోవైపు రెండు దేశాలు అణు యుద్ధానికి దిగితే ఆ ప్రభావం మొత్తం ప్రపంచం మీదా ఉంటుందని అమెరికాలోని కొలరాడొ బౌల్డర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రియాన్ టూన్ వెల్లడించారు.

అణు యుద్ధం-అనంతర పరిణామాలు అన్న అంశంపై 35 సంవత్సరాల పాటు అధ్యయనం చేసిన ఆయన... భారత్-పాకిస్తాన్‌ల మధ్య అణు యుద్ధం వస్తే సుమారు 200 కోట్ల మంది ఆకలితో మరణిస్తారని నోబెల్ శాంతి బహుమతి పురస్కార గ్రహీత ఇరా హెల్ ఫాండ్ అంచనా వేసినట్లు వెల్లడించారు.

అణు ధార్మికత ప్రభావంతో పంటలు పండని పరిస్ధితులు దాపురిస్తాయని, 90 శాతం మంది ప్రజలు ఆకలితో చనిపోతారని వివరించారు. ఈ సమయంలో అణ్వాయుధాల దుష్పరిణామాలపై రెడ్ క్రాస్ సొసైటీ అంతర్జాతీయ కమిటీ ఒక వీడియోను విడుదల చేసింది.