ప్రేమించిన వాడితో జీవితాంతం కలిసి ఉండాలని చాలా మంది ఆశపడతారు. ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలని ముచ్చటపడతారు. కానీ.. అన్ని ప్రేమలు పెళ్లి దాకా చేరవు. కొన్ని మధ్యలోనే ఆగిపోతాయి. ఇద్దరి మధ్య మనస్పర్థల వల్లే.. ఇంకేదైనా కారణం వల్లో.. వాళ్లు విడిపోవాల్సి వస్తుంది. చైనాకి చెందిన ఓ జంట కూడా అలానే విడిపోవాల్సి వచ్చింది.

అయితే.. తాను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ప్రియుడు.. తనని కాదని వెళ్లిపోవడం ఆమె తట్టుకోలేకపోయింది. కడతాక తోడు ఉంటాడనుకున్న వ్యక్తి మధ్యలోనే బ్రేకప్ చెప్పడంతో ఆమె గుండె పగిలిపోయింది. దీంతో ప్రియుడి మీద ఎక్కడలేని కోపం వచ్చింది. అంతే.. అతనికి దాదాపు వెయ్యి కిలోల ఉల్లిపాయలు పంపించింది. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రియుడు బ్రేకప్ చెప్పిన తర్వాత సదరు యువతి దాదాపు మూడు రోజులు కన్నీరు మున్నీరుగా విలపించిందట. ఇక తన వంతు అయిపోయిందని.. ఇక ఏడవాల్సిన వంతు తన మాజీ ప్రియుడిది అని అనుకుందట. కానీ.. తాను ఏడ్చినట్లు అతను ఏడవాలని రూల్ ఏమీ లేదు కదా. అందుకే అతని ఇంటికి దాదాపు వెయ్యి కిలోల ఉల్లిపాయలు పంపింది.

ఉల్లిపాయ కోసిన ప్రతిసారి అతని కంటి వెంట నీళ్లు వస్తాయి కదా.. అలా తన బాధ తీరుతుందని.. తన కారణంగానే అతను ఏడ్చినట్లు ఫీలౌతానని ఆమె చెప్పడం  విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడం విశేషం.