ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్థాన్‌‌లో హిందువుల బాధల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బలవంతపు మార్పిడిలు, హిందూ అమ్మాయిలపై అత్యాచారాలు, కిడ్నాప్‌లు ఇలా ఎన్నో దారుణాలు. ఇలాంటి చోట ఓ హిందూ యువతి చరిత్ర సృష్టించింది. దేశ అత్యున్నత సర్వీసు అయిన పాకిస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ (పీఏఎస్‌)కు ఆమె ఎంపికయ్యారు.

సింధ్‌ ప్రావిన్స్‌లోని షికార్‌పుర్‌కు చెందిన ఎంబీబీఎస్‌ వైద్యురాలు సనా రామ్‌చంద్‌ ఈ ఘనత సాధించారు. పాక్‌ ప్రభుత్వం నిర్వహించిన సెంట్రల్‌ సుపీరియర్‌ సర్వీసెస్‌ (సీఎస్‌ఎస్‌) పరీక్షలను మొత్తం 18,533 మంది రాశారు. ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల అనంతరం 221 మందితో తుది జాబితా ప్రకటించారు.

అందులో సనా రామ్‌చంద్‌ పేరు ఎంపికయ్యారు. పీఏఎస్‌ అనేది భారత్‌లో ఐఏఎస్‌తో సమానం. ఫలితాల అనంతరం ‘‘వాహే గురూ జీ కా ఖల్సా వాహే గురూజీ కి ఫతే’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. తాను ఈ స్థాయికి రావడం వెనుక తల్లిదండ్రుల శ్రమ వందున్నారు.

పీఏఎస్‌‌కు ఎంపికైన వారు ముందు అసిస్టెంట్‌ కమిషనర్లుగా, తర్వాత జిల్లా కమిషనర్లుగా పదోన్నతి పొందుతారు. సనా తొలుత ఎంబీబీఎస్‌ను సింధ్‌ ప్రావిన్స్‌లోని చంద్కా మెడికల్‌ కళాశాలలో పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె సింధ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూరాలజీ, ట్రాన్స్‌పరెంట్‌లో ఎఫ్‌సీపీఎస్‌ చేస్తున్నారు.

ఇది పూర్తవ్వగానే సర్జన్‌గా అర్హత సాధిస్తారు. కాగా, పాకిస్థాన్‌లో హిందు జనాభా అత్యధికంగా సింధ్‌ ప్రావిన్స్‌లోనే ఉంది. సనా ఈ ఘనత సాధించడంపై ఆ దేశంలోని పలువు రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి. ‘‘సింధ్‌లోనే కాదు.. పాకిస్థాన్‌లోని హిందూ సమాజం గర్వపడేలా సనా రామ్‌చంద్‌ చేశారు’’ అని పాకిస్థాన్‌ పీపుల్స్ పార్టీ నేత ఒకరు ట్వీట్ చేశారు.