ఆకాశంలో రెండు హెలికాఫ్టర్లు ఢీ కొని 13మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మాలి దేశంలోని సాహెల్ లో చోటుచేసుకుంది. మాలిలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మంగళవారం నిర్వహించిన ఆపరేషన్ లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్లు ఢీకొనడం వల్ల సైనికులు మరణించారని ఫ్రాన్స్ అధ్యక్షుడి కార్యాలయం కూడా ధ్రువీకరించింది.

చనిపోయిన వారి కుటుంబాలకు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేకాన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారిలో ఆరుగురు అధికారులు ఉన్నట్లు ప్రకటన పేర్కొన్నారు.  కొన్ని దశాబ్దాల కాలంలో ఇది అత్యంత విషాదకర మిలిటరీ ప్రమాదమని వెల్లడించారు. దుర్ఘటనకు గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

ఇస్లామిక్ మిలిటెంట్లు మాలిలోని ఉత్తర ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో 2013లో ఫ్రాన్స్ ప్రభుత్వం తన బలగాలను మోహరించింది. ప్రస్తుతం సుమారు 4,500 ఫ్రాన్స్ బలగాలు మాలీ సైన్యానికి సహకరిస్తున్నాయి.