Flash floods: ఉత్తర పర్వాన్ ప్రావిన్స్‌లో ఆదివారం వరదలు సంభవించాయని బఖ్తర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. పెద్దసంఖ్యలో సంభవించిన మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని, 17 మంది గాయపడినట్లు పేర్కొంది. వందల మంది గల్లంతయ్యారు.
Flash floods in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆకస్మిక వరదలు పొటెత్తి డజన్ల మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా పేర్కొంది. ఆదివారం నాడు సంభవించిన వరదల కారణంగా 31 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 17 మంది గాయపడ్డారని తాలిబన్ మీడియా పేర్కొంది. అయితే, 40 మందికి పైగానే మరణించారని ఇతర రిపోర్టులు పేర్కొంటున్నాయి.
వివరాల్లోకెళ్తే.. భారీ వర్షాల కారణంగా ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పటివరకు 31 మంది మరణించారు. వరదల కారణంగా డజన్ల కొద్దీ మంది తప్పిపోయారని తాలిబాన్ ప్రభుత్వ వార్తా సంస్థ సోమవారం నివేదించింది. ఉత్తర పర్వాన్ ప్రావిన్స్‌లో ఆదివారం వరదలు సంభవించాయని బఖ్తర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. పెద్దసంఖ్యలో సంభవించిన మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని, 17 మంది గాయపడినట్లు పేర్కొంది. ఈ వరదల కారణంగా సోమవారం నాడు దాదాపు 100 మంది తప్పిపోయినట్లు నివేదిక పేర్కొంది. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే, వరదల వల్ల గల్లంతైన వారి కోసం వెతుకుతున్నామనీ, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
ఆకస్మిక వరదలు పర్వాన్‌లోని మూడు జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపింది. ప్రభావిత జిల్లాల్లో డజన్ల కొద్దీ ఇళ్లు వరద నీటికిలో కొట్టుకుపోయాయి. ఈ ప్రావిన్స్ పర్వతాలతో నిండి ఉంది. తరచుగా భారీ వర్షాల నుండి వరదలను ఎదుర్కొంటోంది. ఆఫ్ఘనిస్తాన్‌లోని 34 ప్రావిన్సుల్లో చాలా వరకు రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా జూలైలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు నెల (జూన్) లో 19 మంది మరణించారు. వేలాది మంది వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయారు.
కాగా, తాజాగా సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అలాగే, ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు ఘజనీ ప్రావిన్స్‌లో సోమవారం ఒక ప్రయాణీకుల బస్సు ఆకస్మిక వరదలో చిక్కుకోవడంతో ముగ్గురు పిల్లలు, ఇద్దరు పెద్దలు సహా ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు ధృవీకరించినట్లు ప్రభుత్వ బక్తర్ వార్తా సంస్థ మంగళవారం నివేదించింది. ప్రావిన్షియల్ ప్రభుత్వ అధికారి మవ్లావి హబీబుల్లా ముజాహిద్ ఈ విషయం వెల్లడించినట్టు పేర్కొంది. బస్సు సోమవారం అర్థరాత్రి గిలాన్ జిల్లా వైపు వెళుతుండగా, అది ఆకస్మిక వరదలో చిక్కుకుంది. కుండపోత వర్షాలు, వరదలు ఆది, సోమవారాల్లో తూర్పు పర్వాన్, నంగర్‌హార్ ప్రావిన్సులలో మూడు డజన్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. వందలాది మంది తప్పిపోయారు.
