కరోనా కారణంగా గ్రామీ అవార్డుల వేడుకలు వాయిదా పడ్డాయి. గ్రామీ అవార్డులను సంగీత ప్రపంచంలో ఆస్కార్ అవార్డుగా భావిస్తారు. ఈ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14న నిర్వహించనున్నట్లు గ్రామీ ప్రతినిధులు ప్రకటించారు. 

మొదట జనవరి 31న అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించాలని నిర్ణయించినా, కరోనా కారణంగా మార్చికి వాయిదా వేసినట్టు వారు వెల్లడించారు. ఆరోగ్య నిపుణులు, కళాకారులతో చర్చించిన తర్వాత 63వ గ్రామీ పురస్కారాల వేడుకను మార్చి 14, ఆదివారం నిర్వహించాలని నిర్ణయించుకున్నాం.. అని అకాడమీ ప్రతినిధులు తెలిపారు. 

యూఎస్ లో ఒక వైపు వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుండగా మరోవైపు కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా లాస్ ఏంజిల్స్ లో ఆస్పత్రులు, ఐసీయూలు కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అవార్డుల ప్రదానోత్సవాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 

హాలీవుడ్ లో జరిగే గ్రామీస్, గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వంటి ప్రముఖ అవార్డుల వేడుకలకు వేదికగా లాస్ ఏంజిల్స్ నిలుస్తోందన్న సంగతి తెలిసిందే.