ఈ జనరేషన్ తమకు ఏం కావాల్సి వచ్చినా గూగుల్‌‌పైనే ఆధారపడుతున్నారు.. ఒక చిన్న సెర్చ్ ఇంజిన్ ఇప్పుడు తను లేకుండా ప్రపంచాన్ని ఒక సెకను పాటు కూడా ఊహించుకోలేని స్థితికి తీసుకొచ్చింది. పురుడు పోయటం దగ్గర నుంచి ఒక మనిషిని ఎలా చంపాలో తెలుసుకునేంత వరకు ప్రతి దాని కోసం గూగులే ఆధారమైంది. ఇప్పటికే మానవాళి అవసరాలు తీరుస్తున్న గూగుల్.. మరో నూతన ఆవిష్కరణ చేసింది.. మనిషికి చావు ఎప్పుడొస్తుందో కూడా తెలిపేలా గూగుల్‌ కొత్త ఫీచర్ తెచ్చింది.

ఒక ఆసుపత్రిలో రోగి ఎంతకాలం ఉండాల్సి వస్తుంది..? వ్యాధి తీవ్రత ఎలా ఉంది..? బాధితుల వ్యాధుల చరిత్రను తెలుసుకుని.. ఇప్పటి వరకు వాడిన మందులేంటో చూసి వారి ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి కచ్చితమైన సమాచారాన్ని అందించే ఒక టూల్‌ను గూగుల్ హెల్త్‌ కేర్ విభాగం రూపొందించింది. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతూ ఓ మహిళ ఆసుపత్రిలో చేరగా.. ఆమె మరణించడానికి 9.3% అవకాశం ఉందని వైద్యులు అంచనా వేశారు..

తర్వాత గూగుల్ హెల్త్ టూల్‌ను ఉపయోగించగా.. మొత్తం 1,75,639 అంశాలను విశ్లేషించి.. ఆమె ఆసుపత్రిలోనే మరణించడానికి 19.9 శాతం అవకాశముందని లెక్కగట్టింది. చివరకు గూగుల్ చెప్పిందే నిజమైంది. దీనికి మరికొన్ని మార్పులు చేసి.. అతి త్వరలో ఈ అప్లికేషన్‌ను ఆసుపత్రులకు అందజేస్తామని గూగుల్ తెలిపింది.