మాస్కో:ఓ మహిళ నోట్లో నుండి వైద్యులు పామును బయటకు తీశారు. ఈ సందర్భంగా వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన రష్యాలో చోటు చేసుకొంది.

రష్యాలోని డజెస్థాన్ ప్రాంతంలోని లెవాషి గ్రామానికి చెందిన ఓ యువతి నిద్ర పోతున్న సమయంలో ఆమెకు తెలియకుండానే ఆమె నోట్లోకి నాలుగు అడుగుల పాము వెళ్లింది.  తెల్లారిన తర్వాత కడుపులో ఎదో తిరుగుతున్నట్టుగా అన్పించి ఆమె ఆసుపత్రిలో చేరింది.

ఆమెకు స్కాన్ చేస్తే కడుపులో పాము లాంటిది కన్పించింది. దీంతో ఆపరేషన్ చేసి దాన్ని తీయాలని వైద్యులు భావించారు. వెంటనే ఈ విషయాన్ని ఆమెకు చెప్పి వెంటనే ఆపరేషన్  చేశారు.

సాధారణంగా చేసే ఆపరేషన్లకు భిన్నంగా ఈ ఆపరేషన్ చేశారు. పైపును ఆమె కడుపులోకి పంపి పామును బయటకు వచ్చేలా చేశారు. పాము కొసను పట్టుకొని ఓ నర్సు బయటకు లాగింది. దీంతో ఆ పాము ఆ యువతి కడుపు నుండి బయటకు వచ్చింది. ఈ తతంగాన్ని  మొత్తం వీడియో తీశారు. 

అయితే యువతి కడుపులో చేరిన పాము బతికిందా.... చనిపోయిందా అనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. యువతి కడుపులో నుండి పామును బయటకు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ యువతి కడుపులోకి పాము ఎలా చేరిందనే విషయం ఇంకా మిస్టరీగా ఉంది.