గోవా ముఖ్యమంత్రి, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ క్యాన్సర్‌తో చనిపోయిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ముంబై, ఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు అమెరికాలోనూ చికిత్స తీసుకున్న పారికర్ అనారోగ్యంతో బాధపడుతూనే ఆస్పత్రి నుంచే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

మరోవైపు మనోహర్ పారికర్ భార్య కూడా క్యాన్సర్ కారణంగా చనిపోయారు. 2000 అక్టోబర్‌‌లో తొలిసారి గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన కొద్దినెలల్లోనే భార్య మేధా క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు.

పారికర్, మేధాకు 1979 జూన్ 2న వివాహం జరిగింది. ఈ దంపతులకు ఉత్పల్, అభిజిత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 40 ఏళ్ల వయసులోనే భార్య తనకు దూరమైందంటూ పారికర్ తన 60వ పుట్టినరోజు సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనంతరం మూడేళ్లకే భార్యను బలి తీసుకున్న అదే క్యాన్సర్ వ్యాధితో మనోహర్ పారికర్ కూడా మరణించడం అత్యంత బాధాకరం.