Asianet News TeluguAsianet News Telugu

గ్యాస్ ట్యాంకర్ పేలి.. కనీసం 50 మంది సజీవ దహనం

కరీబియన్ దేశం హైతీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో చమురు భారీగా లీక్ అయింది. ఆ తర్వాత అక్కడ మంటలు వ్యాపించాయి. సమీపంలోని సుమారు 20 ఇళ్లు దగ్దమయ్యాయి. ఈ దుర్ఘటనలో 50 నుంచి 54 మంది సజీవ దహనం అయ్యారని ఓ అధికారి వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. 

gas tanker blast in haiti over 50 people burned alive
Author
New Delhi, First Published Dec 14, 2021, 7:55 PM IST

న్యూఢిల్లీ: కరీబియన్ కంట్రీ హైతీ(Haiti)లో దారుణం జరిగింది. ఓ గ్యాస్ ట్యాంకర్(Gas Tanker) ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌ను తప్పించబోయి బోల్తా పడింది. వేగంగా వెళ్తున్న ట్రక్ ఆకస్మికంగా బ్రేక్ వేయడంతో బోల్తా పొడి కొంత దూరం అలాగే వెళ్లింది. అనంతరం, భారీ పేలుడు(Blast) సంభవించింది. ఆ చుట్టుపక్కల ఉన్న కనీసం 20 ఇళ్లు పూర్తిగా భస్మమయ్యాయి. ఈ ఘటనలో కనీసం 50 మంది సజీవ దహనం అయ్యారు. ఘటనా స్థలిలో తాను కనీసం 50 నుంచి 54 మంది సజీవ దహనం(Burned Alive) అయినట్టు తాను చూశానని డిప్యూటీ మేయర్ ప్యాట్రిక్ ఆల్మనర్ తెలిపారు. వారిని కనీసం గుర్తించడం కూడా సాధ్యపడదని అన్నారు. గ్యాస్ ట్యాంకర్ పేలుడుతో అక్కడ సుమారు 20 ఇళ్లు దగ్దం అయ్యాయని చెప్పారు. ఆ ఇళ్లలోని బాధితుల వివరాలను ఇవ్వలేము అని తెలిపారు.

మంగళవారం ఉదయం క్యాప్ హైతీయన్ నగరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్ వేగంగా వెళ్తుండగా ఎదురుగా మోటార్ సైకిల్ ట్యాక్సీ వచ్చిందని అల్మనర్ చెప్పారు. ఆ మోటార్ సైకిల్ ట్యాక్సీని తప్పించే క్రమంలోనే ట్యాంకర్‌పై డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉంటాడని వివరించారు. అప్పుడే ఆ ట్యాంకర్ తలకిందులై బోల్తా కొట్టి ఉంటుందని అన్నారు. బోల్తా పడ్డ ఆ ట్యాంకర్ నుంచి చమురు లీక్ అయిందని వివరించారు. ఆ రోడ్డు అంతా వరద పారిందని పేర్కొన్నారు. అసలే దేశంలో గ్యాస్ సరఫరాలు చాలా మితంగా ఉండటంతో పాదచారులు వెంటనే ఆ చమురును సేకరించడానికి పరుగున వచ్చారని తెలిసిందని చెప్పారు. అప్పుడే అనుకోకుంట అక్కడ మంటులు వ్యాపించాయని, చాలా విస్తీర్ణం మేరకు చమురు వ్యాపించి ఉండటంతో మంటల ప్రభావం తీవ్రమైందని అన్నారు.

Also Read: ఆయిల్ ట్యాంకర్ పేలి 92 మంది దుర్మరణం.. మరో 30 మంది పరిస్థితి విషమం

ఈ ఘటన జరిగిన జస్టినియన్ యూనివర్సిటీ హాస్పిటల్‌ పేషెంట్లతో నిండిపోయింది. ఈ పేలుడులో గాయపడ్డ చాలా మంది ఈ హాస్పిటల్ చేరారు. ఇందులో చాలా మంది సీరియస్ కండీషన్‌లో ఉన్నారు. సీరియస్  కండీషన్‌లో ఉన్న పేషెంట్లు అందరినీ కాపాడే సామర్థ్యం తమ దగ్గర లేదని ఓ నర్సు పేర్కొన్నారు.

ఈ ఘటనపై హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ మాట్లాడారు. క్యాప్ హైతీయన్ సిటీలో గ్యాస్ ట్యాంకర్ పేలుడు ఘటన దిగ్భ్రాంతికరం అని పేర్కొన్నారు. ఈ ఘటనపై తాను భావోద్వేగం చెందానని అన్నారు. ఈ ఘటనలో సుమారు 40 మంది మరణించారని చెప్పారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఉన్నారని వివరించారు. దేశంలో మూడు రోజులు సంతాప దినం పాటిస్తుందని అన్నారు.

Also Read: ఆయిల్‌ ట్యాంకర్ పేలి 20 మంది మృతి: 80 మందికి గాయాలు

ఈ కరీబియన్ దేశం అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ఇప్పటి వరకు దేశ ప్రజలు అందరి అవసరాలకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేదు. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాలకే అది కూడా రోజులో కొన్ని గంటలు మాత్రమే విద్యుత్‌ను అందిస్తున్నది. అందుకోసమే ఖర్చుతో కూడుకున్న జనరేటర్లనూ కొందరు తప్పక వినియోగిస్తున్నారు. ఈ దేశంలో గ్యాస్ డిమాండ్ విపరీతంగా ఉన్నది. కానీ, కొన్ని క్రిమినల్ గ్యాంగులు గ్యాస్ సరఫరాను బ్లాక్ చేస్తున్నాయి. ఆయిల్ టర్మినల్స్, సిటీ శివారుల్లో ఈ గ్యాంగ్‌లు గ్యాస్ సరఫరాను నిలిపేస్తున్నాయి. దీంతో ప్రజలకు ఇది చాలా మటుకు అందుబాటులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఓ గ్యాస్ ట్యాంక్ బోల్తా పడి లీక్ కావడంతో పాదచారులు వెంటనే దాన్ని సేకరించడం మొదలు పెట్టారు. కానీ, మంటలు వ్యాపించడంతో సజీవ దహనం అయ్యారు. కనీసం గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios