Asianet News TeluguAsianet News Telugu

వారంలో నాలుగు రోజులే పనిదినాలు.. వర్క్ తర్వాత బాస్‌ ఆదేశాలను నిరాకరించే హక్కు

వారంలో నాలుగు రోజులు పని దినాల విధానాన్ని ప్రవేశపెట్టాలని బెల్జియం ప్రభుత్వం యోచిస్తున్నది. అంతేకాదు, వర్క్ అవర్స్ అయిపోయాక బాస్ నుంచి వచ్చే ఆదేశాలనూ నిరాకరించడానికి హక్కు కల్పించాలని భావిస్తున్నది. బెల్జియం వాసుల జీవితాలు, పనిని సమతుల్యం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ డాక్యుమెంట్ తెలిపింది. ఇప్పటికే వారంలో మూడు రోజులు ఆఫ్ ఇచ్చే విధానంపై పలు దేశాలు ట్రయల్స్ చేశాయి. 
 

four week days and right to ignore bosses says belgium govt
Author
New Delhi, First Published Feb 16, 2022, 6:43 PM IST

న్యూఢిల్లీ: సెలవులు అంటే విద్యార్థులకే కాదు.. ఉద్యోగులకు పండుగే. ప్రతి ఉద్యోగి సెలవుల కోసం రోజులు లెక్కపెట్టుకోవడం సర్వ సాధారణమే. వీకెండ్(Weekend) కోసం ఎదురుచూడటం అందరికీ తెలిసిన విషయమే. వారంలో రెండు రోజుల సెలవు(Holiday) కోసం ఆతృతగా చూస్తుంటారు. కానీ, కొన్ని దేశాలు వారంలో మూడు రోజులు సెలవు ఇచ్చే ఆలోచనలు చేస్తున్నాయి. ఆ దేశాల జాబితాలో కొత్తగా బెల్జియం(Belgium) చేరింది. కొవిడ్ సమయంలో కార్మిక చట్టాల్లో తీసుకుంటున్న ప్రధానమైన సవరణలు ఇవి అని బెల్జియం ప్రధాన మంత్రి అలెగ్జాండర్ డి క్రూ మంగళవారం తెలిపారు. కొవిడ్ కారణంగా మరింత ఫ్లెక్సిబుల్‌గా పని చేయాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఈ మార్పులపై మంత్రులతో మాట్లాడామని వివరించారు.

ఇందులో మరో కీలకమైన సవరణ కూడా చేసింది. వర్క్ అయిపోయాక బాస్ నుంచి వచ్చే ఆదేశాలను నిరాకరించే హక్కునూ ఉద్యోగులు కలిగి ఉండాలనే సవరణను బెల్జియం ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వారంలో ఐదు రోజులకు బదులు నాలుగు రోజుల్లో(Four Weekdays)నే ఉద్యోగులు 38 గంటలు పని చేసేలా మార్పులు చేయడానికి సిద్ధమైంది. ఇదంతా వేతనాల్లో ఏమాత్రం కోత పెట్టకుండానే మార్పు చేయాలని భావిస్తున్నది. బెల్జియం వాసుల పని.. వ్యక్తిగత జీవితాలను బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ సవరణలు చేయాలని భావించినట్టు ప్రభుత్వం పేర్కొంది.

అంతేకాదు, ఒక వారంలో ఇంతకంటే ఎక్కువ గంటలు చేసి.. తదుపరి వారంలో తక్కువ గంటలు పని చేసేలా నిబంధనలు మార్చటానికి బెల్జియం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అయితే, ఇలాంటి వెసులుబాటుకు బాస్ లేదా తమపై ఉద్యోగుల నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోవాలనే నిబంధన కూడా పెట్టింది. పెద్ద కంపెనీల్లో పనిని పంచుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి.. అలాంటి ఈ అవకాశం ఉంటుందని వివరించింది.

బెల్జియం ఫెడరల్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ డాక్యుమెంట్‌లోని మార్పులు వెంటనే అమలు కాబోవడం లేదు. ఈ డ్రాఫ్ట్‌పై కార్మికు యూనియన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తారని, ఆ తర్వాత బిల్లులో సవరణలు చేస్తారు. ఆ తర్వాత దాన్ని చట్టం చేసి.. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అడ్వైజింగ్ గవర్నమెంట్ పరిశీలించనుంది. అయితే, ఈ సవరణలు ఈ ఏడాది మధ్యలో అమల్లోకి రాబోతున్నాయి.

ఇదిలా ఉండగా, గతేడాది అక్టోబర్‌లో ఆదివారం సెలవు కోసం మధ్యప్రదేశ్‌కు చెందిన ఎంఎన్ఆర్ఈజీఏ ఇంజినీర్ పై అధికారులకు రాసిన లేఖకు దిమ్మదిరిగే సమాధానం వచ్చింది. ‘నేను గీతా చదువుకుని నా గత జన్మ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నా. నా అహాన్ని నాశనం చేసుకోవడానికి ఇంటింటికి తిరిగి భిక్షం ఎత్తుకోవాలనుకుంటున్నా. ఇది నా ఆత్మక సంబంధించిన విషయం కావునా, నాకు ఆదివారాలు సెలవు ఇవ్వండి’ అని రాజ్‌కుమార్ యాదవ్ సుస్నేర్ జనపద్ పంచాయత్ సీఈవోకు లేఖ రాశాడు.

కానీ, ఆయన రాసిన ఈ దరఖాస్తు లేఖతో మొదటికే మోసం వచ్చింది. ‘ప్రియమైన డిప్యూటీ ఇంజనీర్.. నీ అహాన్ని చంపుకోవాలనుకుంటున్నారు కదా. ఇది సంతోషదాయకమైన విషయం. ఇందులో మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి మేం తోడ్పడవచ్చు. ఒక మనిషి తన ఆదివారాలను ఏ విధంగానైనా గడుపుకోగలననే అహాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఇలాంటి అహాన్ని వేరుల నుంచి తీసేయడమే నీకు పురోగతినిస్తుంది. కాబట్టి, నీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కోసం మీరు ప్రతి ఆదివారాలూ ఆఫీసుకు హాజరై పనిచేయాలని ఆదేశిస్తున్నాం. తద్వారా ఆదివారాలను సెలవుగా వేడుక చేసుకోవాలనే నీ అహాన్ని ఈ విధంగా నాశనం చేసుకోవచ్చు’ అని జన్‌పద్ పంచాయత్ సీఈవో పరాగ్ పంతి సమాధానం రాశారు. దీంతో డిప్యూటీ ఇంజనీర్ రాజ్‌కుమార్ యాదవ్‌కు మొదటికే మోసం వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios