ఎవరైనా ఆపదలో ఉంటే కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. అలాంటి పోలీసు.. పౌరుడి పట్ల కర్కశంగా ప్రవర్తించి ప్రాణం పోయేలా చేస్తే.. అలాంటి దారుణ సంఘటనే ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. ఒక ఆఫ్రికన్ పట్ల పోలీసు అధికారి అతి కిరాతకంగా ప్రవర్తించాడు. ఆఫ్రికన్ దేశానికి చెందిన వ్యక్తి మెడపై కాలు పెట్టి తొక్కాడు. ప్రాణం పోయేలా ఉందని.. వదిలిపెట్టండి సార్ అని వేడుకున్నా.. ఆ పోలీసు అధికారి కనికరించలేదు. ఫలితంగా ఆ ఆఫ్రికన్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ అతి దారుణ సంఘటన అమెరికాలో సోమవారం చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికాలోని మినియాపొలిస్ ప్రాంతంలో పోలీసులు ఓ ఫోర్జరీ కేసు  దర్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలో పోలీసులకు జార్జ్ ఫ్లాయిడ్(46) అనే ఆఫ్రికన్ కనిపించాడు. వెంటనే కారులో నుంచి కిందకు దిగాలని ఆదేశించారు.


 
బయటకు రాగానే జార్జ్ ని బలవంతంగా నేల మీద పడుకోపెట్టారు. చేతికి సంకెళ్లు వేశారు. జార్జ్ మెడపై కాలు పెట్టి ఓ పోలీసు అధికారి తొక్కడం మొదలుపెట్టాడు. ప్రాణం పోతోందని చెప్పినా వినిపించుకులేదు. దీంతో.. జార్జ్ స్పృహ కోల్పోయాడు. అయినా కూడా పోలీసులు అతనిపై కనికరం చూపించకపోవడం గమనార్హం.

వైద్య సిబ్బంది స్ట్రైచర్ తెచ్చేవరకు అతని గొంతుపై పోలీసు అధికారి కాలు తీయకపోవడం బాధాకరం. తర్వాత అతనిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా.. ఈ ఘటన మొత్తాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. వైరల్ గా మారింది. దీంతో.. పోలీసులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఇది కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. అతని మరణానికి కారణమైన నలుగురు పోలీసులను విధుల్లో నుంచి తొలగించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.