బాయ్ ఫ్రెండ్ నిద్రలో గురకపెడితే మీరైతే ఏం చేస్తారు..? చెవులు మూసుకొని పడుకుంటాం కదా.  కానీ.. ఓ మహిళ మాత్రం దానిని టార్చర్ లా భావించింది. అందుకే.. నిద్ర పోతున్న బాయ్ ఫ్రెండ్ ని తుపాకీతో కాల్చేసింది.  ఈ దారుణ సంఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఫ్లోరిడాలోని కొకొవా ప్రాంతానికి చెందిన లోరీ మోరిన్ అనే మహిళకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను తరచూ.. నిద్రలో గురక పెడుతున్నాడు. అది ఆమెకు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో.. ఈ విషయంలో అతనితో తరచూ గొడవపడేది.  దాంతో.. అతను గురకలు రాకుండా ముక్కుకు పెట్టుకునే ‘నోస్ స్ట్రిప్స్’ కూడా తెచ్చుకున్నాడు.

 కానీ అవి సరిగా పని చేయకపోవడంతో మళ్లీ గొడవ పడిన ఆమె పక్కన బీరువాలో ఉన్న తుపాకీ తీసి అతన్ని కాల్చేసింది. తుపాకీ శబ్దం విన్న పక్కింటి వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితురాల్ని అరెస్టు చేసి, ఆమె బాయ్‌ఫ్రెండును ఆస్పత్రికి తరలించారు. 

అతని ప్రాణానికి ఎటువంటి ప్రమాదమూ లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఇటువంటి కేసులు చాలా అరుదని, మరీ ఇంత చిన్న విషయాలకే ఎవరైనా ఎదుటి వారిని చంపేస్తారా అని పోలీసులే ఆశ్చర్యపోయారు. కేవలం గురక పెడుతున్నాడని.. ఇలా కాల్చేస్తారా.. అని స్థానికులు సైతం విస్మయం వ్యక్తం చేశారు.