తాను వద్దని చెప్పినా భార్య ఉద్యోగం మానేయకుండా చేస్తూనే ఉందని ఓ భర్త కోపం పెంచుకున్నాడు. ఆ కోపం కాస్త అతనిని రాక్షసుడిని చేసింది. భార్యను అతి దారుణంగా తుపాకీతో  కాల్చి చంపేశాడు. ఈ దారుణ సంఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఇస్లామాబాద్ కి చెందిన మహిళ ఉరూజ్‌ ఇక్బాల్‌ (27) ఉర్దూ పత్రికలో పనిచేస్తోంది. జర్నలిస్టుగా పనిచేసే దిలావర్ అలీని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి పెళ్లై 7 నెలలు కావస్తోంది. కాగా... వివాహం జరిగిన నాటి నుంచి ఉద్యోగం విషయంలో ఇద్దరికీ మనస్పర్థలు వస్తూనే ఉన్నాయని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

తాజాగా.. ఆఫీసుకి వెళ్లిన ఉరూజ్ ఇక్బాల్ పై.. భర్త తుపాకీ తీసుకొని వెళ్లి.. తలపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె తీవ్రగాయాలపాలైంది. అయితే.. తోటి ఉద్యోగులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చనిపోయిందని తేల్చి చెప్పారు.  

కాగా, మరో ఉర్దూ పత్రికలో పనిచేస్తున్న ఆమె భర్త దిలావర్‌ అలీపై ఉరూజ్‌ సోదరుడు యాసిర్‌ ఇక్బాల్‌ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.ఏడు నెలల కిందట తమ సోదరి అలీని ప్రేమించి పెళ్లి చేసుకుందని, అప్పటి నుంచి ఆమెను అలీ వేధింపులకు గురిచేస్తున్నాడని, ఉద్యోగం మానేయాలని ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడని ఫిర్యాదులో ఇక్బాల్‌ పేర్కొన్నారు.

అలీపై తాము ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో ఈ ఘాతుకం జరిగిందని చెప్పారు. భర్త తీరుతో విసిగిపోయిన తమ సోదరి ఉర్దూ పత్రిక కార్యాలయ భవనం పక్కనే ఓ గదిలో ఉంటోందని ఇక్బాల్‌ తెలిపారు. కాగా హత్య జరిగిన సమయంలో సీసీ టీవీ ఫుటేజ్‌ను స్వాధీనం పరిశీలిస్తున్నామని, కేసు దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు