అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాజీనామా చేశారంటూ నిన్న ఓ పత్రిక కథనం ప్రచురించడంతో ఆ దేశ ప్రజలు షాక్‌కు గురయ్యారు. ప్రఖ్యాత ‘‘వాషింగ్టన్ పోస్ట్ ’’ అనే దినపత్రిక ‘అన్‌ప్రెసిడెంట్’ అనే శీర్షికతో రాసిన కథనంలో ట్రంప్ రాజీనామాతో ప్రపంచ దేశాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయని వెల్లడించింది.

దానికి 2019 ఏప్రిల్ 30న ట్రంప్ వైట్ హౌస్‌ను వదిలివెళ్లిపోయినట్లు లీసా చుంగ్ పేరుతో కథనం ప్రచురితమైంది. ‘రాజీనామా విషయంలో ట్రంప్ అధికారిక ప్రకటన చేయలేదని.. 2019 ఏప్రిల్ 30న ఓవల్ కార్యాలయంలో అధ్యక్షుడి ఛాంబర్‌లోని డెస్క్ పక్కన ఓ న్యాప్‌కిన్ దొరికినట్లు నలుగురు వైట్‌హౌస్ అధికారులు తెలిపినట్లు అందులో రాశారు.

‘‘ తన రాజీనామాకు నిజాయితీ లేని హిల్లరీ క్లింటన్, హైఫియర్‌, నకిలీ వార్తల మీడియాను నిందించండి అంటూ ఎరుపు రంగు ఇంక్‌తో ట్రంప్ రాసినట్లు ఉంది.. ప్రస్తుతం ఆయన వైట్‌హౌస్‌ను వదిలేసి రష్యాలోని క్రిమియాలో ఉన్న ఓ రిసార్ట్‌కు వెళ్లిపోయారు.

దీంతో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ దేశ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు అని కథనం ప్రచురించింది.  2019, మే 1వ తేదీతో ఉన్న ఈ పత్రిక ప్రతులను కొందరు వ్యక్తులు వాషింగ్టన్‌తో పాటు వైట్‌హౌస్‌ సమీపంలో ప్రజలకు ఉచితంగా పంచిపెట్టారు.

తొలుత ఈ వార్తను చదివిన జనం ఆశ్చర్యానికి గురి కాగా... ఆ తర్వాత పబ్లిష్ అయిన తేదీని గమనించి ఇది నకిలీ ఎడిషన్ అని గుర్తించారు. ఆ వార్త ఆ నోటా ఈ నోటా వాషింగ్టన్ విధుల్లో వైరల్‌గా మారడంతో వాషింగ్టన్ పోస్ట్ పత్రిక స్పందించింది. అది నకిలీ ఎడిషన్ అని దానితో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది.