టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మరోసారి ట్విట్టర్ వేదికగా సంచలనం సృష్టించారు. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సవాల్ విసిరారు. తనతో సింగిల్‌గా ఫైట్ చేస్తావా? అంటూ చాలెంజ్ చేశారు. గెలిచిన వారికి ఉక్రెయిన్ సొంతం అంటూ ఈ కుబేరుడు.. పుతిన్‌కు సవాల్ విసిరారు. అంతేకాదు, మరో ట్వీట్ చేసి తన సవాల్‌ను అంగీకరిస్తున్నావా? అంటూ పుతిన్‌ను ట్యాగ్ చేశారు.

న్యూఢిల్లీ: స్పేస్ ఎక్స్ ఫౌండర్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ట్విట్టర్ వేదికగా తనదైన మార్క్‌తో రష్యాపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్.. ప్రపంచంలోనే అతిపెద్ద దేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సవాల్ విసిరారు. తనతో సింగిల్‌గా ఫైట్ చేస్తావా? అంటూ చాలెంజ్ చేశారు. గెలిచినవారికి ఉక్రెయిన్ దక్కుతుందని ట్వీట్ చేశారు. వ్లాదిమిర్ పుతిన్‌ పేరును తన ట్వీట్‌లో రష్యన్ లాంగ్వేజ్‌లో రాశారు. ఉక్రెయిన్‌నూ రష్యన్ లాంగ్వేజ్‌లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ తర్వాత మరోటి చేసి అందులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ట్యాగ్ చేశారు. తన సవాల్‌ను అంగీకరిస్తున్నారా? అంటూ పుతిన్‌ను ట్యాగ్ చేశారు. తనతో నేరుగా ఫైట్ చేస్తావా? అంటూ సవాల్ విసరడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

గత నెల 24వ తేదీన ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడులు 19వ రోజుకు చేరిన సంగతి తెలిసిందే. పశ్చిమ దేశాలు, అమెరికా కలిసి రష్యాను కట్టడి చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. కానీ, అందులో అవి సఫలం కావడం లేదు.

Scroll to load tweet…

నిజానికి ఇప్పుడు ఎలన్ మస్క్ తన వ్యక్తిగత జీవితంలో చాలా బిజీగా ఉంటారని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే.. ఆయన తన జీవిత భాగస్వామి గ్రైమ్స్‌తో మళ్లీ విడిపోతున్నట్టు వార్తలు వచ్చాయి. అదీ వారిద్దరూ రెండో సంతానాన్ని ఆహ్వానించిన తర్వాత ఈ వార్తలు వచ్చాయి. తొలుత వీరికి 2020 మే నెలలో ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత వారిద్దరూ దూరంగా ఉంటున్నట్టు చర్చ జరిగింది. స్వయంగా ఎలన్ మస్క్ కూడా పాక్షికంగా విడిపోయి ఉన్నామని చెప్పారు. తాజాగా, వీరిద్దరూ ఒక పాపను సరోగేట్(అద్దె గర్భం) పద్ధతిలో పొందినట్టు వివరించారు. అదే సమయంలో వీరిద్దరూ తాము ఇద్దరం వీడిపోతున్నట్టు గ్రైమ్స్ వెల్లడించారు. ఈ సందర్భంలో ఎలన్ మస్క్ తన వ్యక్తిగత జీవిత నిర్ణయాల్లో బిజీగా ఉంటారని అందరూ భావించారు. కానీ, ఎలన్ మస్క్.. ఏకంగా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌ను సవాల్ చేసే పనికి పూనుకోవడం గమనార్హం.

Scroll to load tweet…

ఒక వైపు ఎలన్ మస్క్ ఉక్రెయిన్‌కు సహాయం చేస్తుండగా, మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఆయనను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు. రష్యా అధ్యక్షుడు అధికారిక ట్విట్టర్ ఖాతా కేవలం 22 మందిని మాత్రమే ఫాలో అవుతున్నది. అందులో ఎలన్ మస్క్ ఒకరు ఉండటం గమనార్హం.

రష్యా దాడితో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతున్నాయని, తమకు ఎలన్ మస్క్ స్టార్‌లింక్ స్టేషన్లు అందించి ఆదుకోవాలని ఉక్రెయిన్ అధికారులు ఇటీవలే విజ్ఞప్తి చేశారు. దీనికి ఎలన్ మస్క్ సానుకూలంగా స్పందించారు. ఉక్రెయిన్ దేశానికి ఎలన్ మస్క్ స్టార్‌లింక్ స్టేషన్లు అందించి సహకరించారు.

అదే సమయంలో ఆయన రష్యా న్యూస్ సోర్స్ గురించి సానుకూల నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ప్రభుత్వాలు (ఉక్రెయిన్ కాదు) రష్యన్ న్యూస్ సోర్స్‌ను స్టార్‌లింక్ బ్లాక్ చేయాలని కోరాయని ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. కానీ, తాను ఆ పని చేయనని తెగేసి చెప్పారు. గన్‌ తనకు ఎక్కుపెట్టి తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఆ పని చేస్తానని పేరర్కొన్నారు. సంపూర్ణ వాక్‌స్వాతంత్రాన్ని గౌరవించేవాడిగా ఉంటున్నందుకు మన్నించండి అంటూ ట్వీట్ చేశారు.