Russia Ukraine Crisis: ర‌ష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. నాటోలో చేరిక‌తో పాటు మ‌రిన్ని అంశాల నేప‌థ్యంలోనే ర‌ష్యా.. ఉక్రెయిన్ పై దాడికి దిగిన సంగ‌తి తెలిసిందే. ఇక ప్ర‌స్తుతం అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్య‌లు.. ర‌ష్యాను మ‌రింత రెచ్చ‌గొడుతున్నాయా? అంటే అవున‌నే విధంగా ఉంది. 

North Atlantic Treaty Organization : ర‌ష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. యుద్ధం ఆపాల‌ని ఐరాసతో పాటు చాలా దేశాలు కోరుతున్నాయి. అయితే, ఇప్ప‌టికే రష్యా ఉక్రెయిన్ లోని పెద్ద సంఖ్యలో సైనిక స్థావ‌రాల‌ను ధ్వంసం చేయ‌డంతో పాటు సైనిక‌ బ‌ల‌గాలు కీవ్ న‌గ‌రంలోకి ప్ర‌వేశించాయి. ఈ క్ర‌మంలోనే ఉక్రెయిన్ సైనిక‌బ‌ల‌గాలు లొంగిపోతే చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌ని ర‌ష్యా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ర‌ష్యా దాడికి కొన‌సాగిస్తూనే ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేస్తుండ‌టంతో ఉక్రెయిన్ బ‌ల‌గాలు దాడుల‌ను ప్ర‌తిఘ‌టిస్తూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు మ‌రింత‌గా దిగ‌జారుతుండ‌టంతో ఉక్రెయిన్.. కాల్పుల విర‌మ‌ణ‌, శాంతి చ‌ర్చ‌లు జ‌రిపేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించింది. ఇదిలావుండ‌గా, ర‌ష్యా తీరును ఖండిస్తూ.. ఐరాస అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హిస్తోంది. ఐక్య రాజ్య స‌మితిలోని భ‌ద్ర‌తా మండ‌లిలో అమెరికా, అల్బేనియా దేశాలు క‌లిసి ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్దానికి వ్య‌తిరేకంగా తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాయి.

అయితే, ప్ర‌పంచ దేశాలు హెచ్చ‌రిక‌ల‌ను ర‌ష్యా ఏమాత్రం లెక్క‌చేయ‌డం లేదు. ఇలాంటి ప‌రిస్థితులు ఉన్న నేప‌థ్యంలో అమెరికా.. ర‌ష్యాకు క‌ళ్లెం వేయ‌డానికి అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్పిటికే అనేక ఆంక్ష‌లు విధించింది. ఇక తాజాగా అమెరికా అధ్య‌క్షుడు జోబైడెన్ మాట్లాడుతూ.. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) చేర‌డానికి ఐరోపా దేశాలకు త‌లుపులు తెరిచి ఉన్నాయ‌నీ, ప్ర‌త్యేకంగా దీని కోసం చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ప్ర‌క‌టించారు. సారూప్య విలువలు క‌లిగిన దేశాలు నాటో చేర‌వ‌చ్చు అంటూ పేర్కొన్నారు. " ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ అంతర్జాతీయ శాంతి మరియు భద్రత పునాదులను బెదిరిస్తున్నందున, NATO స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యం కోసం నిలబడుతుందని మరోసారి నిరూపిస్తోంది" అని బిడెన్ అన్నారు. అమెరికా "NATO భూభాగంలోని ప్రతి అంగుళాన్ని కాపాడుతుందని మరియు ఆర్టికల్ 5 పట్ల వారి నిబద్ధత ఉక్కుపాదం" అని బిడెన్ పునరుద్ఘాటించారు. "మా నాటో మిత్రదేశాలకు మద్దతు ఇవ్వడానికి ఐరోపాలో మా సామర్థ్యాలను పెంచడానికి అదనపు బలగాలను మోహరించాలని నేను ఆదేశించాను" అని బిడెన్ చెప్పారు.

కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవరపరిచే కారణాలలో NATO భాగస్వామ్యం ఒకటి. ఇప్ప‌టికే నాటోలో చేర‌వ‌ద్ద‌ని పుతిన్ ప‌లు దేశాల‌కు సూచించారు. ఉక్రెయిన్ ను సైతం నాటో చేర‌వ‌ద్ద‌ని ప‌దేప‌దే హెచ్చ‌రించాడు. లెక్క‌చేయ‌ని ఉక్రెయిన్ నాటో చేరేందుకు సిద్ధ‌మైంది. అనేక ద‌శాబ్దాలుగా కొన‌సాగుతున్న వైరంలో యుద్ధం జ‌ర‌గ‌డానికి కార‌ణాల్లో నాటో భాగ‌స్వామ్యం కూడా ఒక‌టైంది. ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయంగా ప‌రిస్థితులు మారుతున్న త‌రుణంలో ర‌ష్యా మ‌రింత దూకుడును ప్ర‌ద‌ర్శిస్తూ.. అన్ని దేశాల‌కు స‌వాలు విసిరేలా ముందుకు సాగుతోంది. ఇలాంటి దారుణ ప‌రిస్థితులున్న త‌రుణంలో అమెరికా అధ్య‌క్షుడు మ‌ళ్లీ నాటో చేరిక‌ల‌ను గురించి ప్ర‌స్తావించ‌డం ర‌ష్యాను మ‌రింత ఆగ్ర‌హానికి గురిచేసే విధంగా ఉంది. అమెరికా గ‌న‌క ర‌ష్యాపై ప్ర‌త్య‌క్ష యుద్ధానికి దిగితే మూడో ప్ర‌పంచ యుద్ధం త‌ప్ప‌ద‌నే అంచ‌నాలు ఉన్నాయి. అంత‌వ‌ర‌కు ప‌రిస్థితులు వెళ్ల‌క‌పోవ‌చ్చున‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు దారుణంగా మారకుండా.. రష్యా దాడి కారణంగా మరిన్ని ప్రాణాలు పోకుండా ఉంచేందుకు ఐరాస చర్యలు ప్రారంభించింది. చాలా దేశాలు రష్యాకు వ్యతిరేకంగా తీర్మానాలకు ఓటు వేస్తున్నాయి.