Donald Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపగలిగితే స్వర్గానికి వెళ్లే అవకాశముందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. హత్యాయత్నం తర్వాత మతపరమైన విషయాలపై ఆయన ఆసక్తి పెంచుకున్నట్టు తెలుస్తోంది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రంప్ తన ప్రత్యేక శైలితో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. కానీ ఈసారి ట్రంప్ చేసే వ్యాఖ్యలు మాత్రం అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ తాను ఒక పనిని విజయవంతంగా చేయగలిగితే, స్వర్గానికి వెళ్లే అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఇంతకీ ఆ పని ఏంటీ? ఆయన మాటల వెనుక అంతర్యమేమిటీ?
ఉక్రెయిన్ యుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి షాకింగ్ ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో తాను విజయం సాధిస్తే, బహుశా తాను స్వర్గానికి వెళ్లే అవకాశాలు పెరుగుతాయని ట్రంప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
మంగళవారం ఒక అమెరికన్ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. 'నేను స్వర్గానికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాను. నా పరిస్థితి బాగా లేదని, నేను ప్రతి చోట ఉంటున్నాననీ విన్నాను. కానీ, నేను ఈ పని చేయగలిగితే, బహుశా ఇది నేను స్వర్గానికి వెళ్లే మార్గాన్ని కనుగొనడానికి కారణం కావచ్చు' అని అన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నానని, దీనికోసం తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలని డొనాల్డ్ ట్రంప్ గతంలో అన్నారు. ఈ ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం కేవలం ప్రపంచానికి మాత్రమే కాకుండా తన రాజకీయ, వ్యక్తిగత జీవితానికి కూడా చాలా ముఖ్యమని ట్రంప్ విశ్వసిస్తున్నారు.
హత్యాయత్నం తరువాత మార్పు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత జీవితం ఎన్నో వివాదాలున్నాయి. ఆయన మూడుసార్లు వివాహం చేసుకున్నారు, రెండుసార్లు అభిశంసనను ఎదుర్కొన్నారు. ఇటీవల ఒక క్రిమినల్ కేసులో దోషిగా నిర్ధారించబడ్డారు. అయితే, గత సంవత్సరం హత్యాయత్నం నుండి బయటపడిన తర్వాత ట్రంప్ మతపరమైన విషయాలపై మొగ్గు చూపుతున్నారు. జనవరిలో ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా మాట్లాడుతూ. తాను అమెరికాను మళ్లీ గొప్పగా చేయగలిగితేనే దేవుడు తనని రక్షిస్తాడని పేర్కొన్న విషయం తెలిసిందే.
పెరుగుతున్న మద్దతు
అమెరికా మత విభాగం ముఖ్యంగా క్రైస్తవ మితవాద సమూహం, ట్రంప్‌కు బలంగా అండగా నిలుస్తోంది. తన రెండవ పదవీకాలం ప్రారంభం నుండి ట్రంప్ తన మత విశ్వాసాన్ని తరుచు ప్రకటిస్తూనే ఉన్నారు. ఆయన అధికారికంగా ఆధ్యాత్మిక సలహాదారు పౌలా వైట్‌ను నియమించారు. పౌలా వైట్ వైట్ వైట్‌లో అనేకసార్లు ప్రార్థన సమావేశాలను నిర్వహించారు, అక్కడ ప్రజలు ట్రంప్ కోసం సమిష్టిగా ప్రార్థన కూడా చేశారు. మత పెద్దలను నుంచి కూడా ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు.
భారత్ పై ట్రంప్ సుంకాలు విధించడానికి కారణమదే?
అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై ఆంక్షలు విధించడానికి గల కారణాలను వైట్ హౌస్ వివరిస్తుంది. ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనను సమర్థించింది. ఆమె మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్నిఆపడానికి అధ్యక్షుడు చాలా ఒత్తిడి తెచ్చారు. దీనికి సంబంధించి ఆయన చాలా కఠినమైన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే భారతదేశంపై కొన్ని చర్యలు తీసుకున్నారు. యుద్ధాన్ని పూర్తిగా ఆపాలని ట్రంప్ కోరుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
