మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ‌ని కలిసిన ఫడ్నవీస్ రాజీనామా లేఖను సమర్పించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజులకే దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయడం గమనార్హం. 

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం నాడు  మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర ప్రజలు మహాయుతికే పట్టం కట్టారని సీఎం ఫడ్నవీస్ చెప్పారు.బీజేపీ, శివసేనకు 70 శాతం ఓట్లు వచ్చాయన్నారు. శివసేన కంటే బీజేపీకే ఎక్కువ అసెంబ్లీ వచ్చాయని పడ్నవీస్ గుర్తు చేశారు.బలబలాలు చూసిన తర్వాత శివసేన బేరసారాలకు దిగిందన్నారు.

Also Read:సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా: ఫడ్నవీస్

విడతల వారీగా సీఎం పదవి విషయంలో తాము శివసేనకు ఎలాంటి హామీ ఇవ్వలేదని పడ్నవీస్ స్పస్టం చేశారు. తమతో పొత్తు కుదిరిన తర్వాత శివసేన తమను మోసం చేసిందని ఆయన విమర్శించారు.

ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా శివసేన వెళ్లిందని ఆయన చెప్పారు. సీఎం పదవిపై 50:50 ఫార్మూలాపై తాము శివసేనకు ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు.అబద్దాలాడుతూ ఇతర పార్టీలతో శివసేన  బేరసారాలు  చేసిందని ఫడ్నవీస్ ఆరోపించారు.

 తమకు సంఖ్యా బలం లేదని  గవర్నర్ కు తాము చెప్పిన తర్వాతే శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ పిలిచారని ఆయన చెప్పారు. కొద్దిసేపట్లోనే తాను గవర్నర్ కు రాజీనామా లేఖను అందించనున్నట్టుగా ఫడ్నవీస్ తేల్చి చెప్పారు.

అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో  తమకు సంఖ్యాబలం లేదని తేలిందన్నారు. దీంతో తాము రాజీనామా చేయడం మినహా వేరే ఆఫ్షన్ లేదని ఆయన చెప్పారు. దీంతో సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.

ఇతర పార్టీలను ప్రలోభపెట్టే ప్రయత్నం చేయబోమని  దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చి చెప్పారు. అంతేకాదు తాము భాద్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ఫడ్నవీస్  స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.

Also Read:Maharashtra update:అజిత్ పవార్ రాజీనామా: చక్రం తిప్పిన శరద్ పవార్ భార్య

శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆయన చెప్పారు. శివసేన అధికారం కోసం తీవ్రంగా తాపత్రయపడుతుందని ఆయన విమర్శించారు. మూడు పార్టీల కూటమి ప్రభుత్వం సుస్థిరంగా పాలన సాగించదని ఆయన అభిప్రాయపడ్డారు.