Asianet News TeluguAsianet News Telugu

పీహెచ్‌డీలు, పీజీ డిగ్రీలు అన్నీ వేస్ట్.. వారందరికంటే ముల్లాలు గ్రేట్: తాలిబాన్ విద్యా శాఖ మంత్రి

తాలిబాన్ ప్రభుత్వ ఛాందసవాద రూపం మెల్లగా వెల్లడవుతున్నది. ఆ ప్రభుత్వ విద్యా శాఖ మంత్రి విద్యను చులకన చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పీహెచ్‌డీలు, మాస్టర్ డిగ్రీలన్ని పనికిమాలినవనీ, వారందరికంటే ముల్లాలు, తాలిబాన్లు ఉన్నతులని పేర్కొనడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

degrees are not valuable says taliban education minister
Author
New Delhi, First Published Sep 8, 2021, 2:23 PM IST

న్యూఢిల్లీ: తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటు ప్రకటన వెలువడ్డ తర్వాతి రోజే తన తిరోగమన భావాలను వెదజల్లుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. తాలిబాన్ విద్యా శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆ దేశ యువత, పిల్లల భవితను ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయి. ఒక విద్యా శాఖ మంత్రి అయి ఉండి విద్యను చులకన చేస్తూ మాట్లాడారు. తమ నూతన ప్రభుత్వం అన్ని విషయాలకూ షరియా చట్టాన్ని వర్తింపజేస్తుందని ప్రకటించిన తర్వాతి రోజే ఈ వీడియో బయటికి రావడం గమనార్హం.

‘పీహెచ్‌డీ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీలు నేడు విలువలేనివి. అధికారంలోని తాలిబాన్లు, ముల్లాలలో ఎవరికీ పీహెచ్‌డీ డిగ్రీ, ఎంఏ డిగ్రీ లేదా కనీసం హైస్కూల్ డిగ్రీ కూడా లేదు. కానీ, వారు అందరి కంటే గొప్పవాళ్లు’ అని విద్యా శాఖ మంత్రి షేక్ మోల్వీ నూరుల్లాహ్ మునీర్ వ్యాఖ్యానించారు.

 

ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు ఈ మనిషి విద్య గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టు అంటూ ఓ ట్విట్టర్ యూజర్ పెదవి విరిచారు. ‘ఉన్నత విద్యా శాఖ మంత్రి ఉన్నత విద్య విలువలేనిదని అంటున్నారు’ అంటూ ఇంకో యూజర్ వ్యంగ్యం పలికారు. విద్యపై ఇంతటి సంకుచిత భావాలున్నవారు అధికారంలో ఉండటం, ఆ దేశ యువత, పిల్లల భవిష్యత్‌కు ప్రమాదకరమని మరో ట్వీట్ వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios