ఖతార్ లో 8 మంది మాజీ నేవీ సిబ్బందికి మరణశిక్ష.. భారత్ అప్పీల్ ను స్వీకరించిన ఆ దేశ కోర్టు
గత నెలలో గూఢచర్యం ఆరోపణల కేసులో ఖతార్ (Qatar)లో మరణ శిక్ష పడిన ఎనిమిది మంది మాజీ ఇండియన్ నేవీ సిబ్బందిని ( former Indian Navy personnel) రక్షించేందుకు భారత ప్రభుత్వం (Indian government) కృషి చేస్తోంది. వారిని జైలు నుంచి విడిపించేందుకు భారత ప్రభుత్వం అప్పీల్ చేయగా.. దానిని విచారించేందుకు అక్కడి కోర్టు (Qatar Court) అంగీకరించింది.
ఖతార్ కోర్టు ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ సిబ్బందికి గత నెలలో మరణ శిక్ష విధించింది. అయితే దీనిపై భారత ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను ఖతార్ కోర్టు గురువారం విచారణకు స్వీకరించింది. ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. అప్పీలును తాము అధ్యయనం చేస్తున్నామని, తదుపరి విచారణ త్వరలోనే జరుగుతుందని కోర్టు వెల్లడించింది.
ఖతార్ లో ఏడాదికి పైగా నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ సిబ్బందికి ఖతార్ లోని కోర్టు అక్టోబర్ లో మరణశిక్ష విధించింది. 2022 ఆగస్టులో ఖతార్ ఎనిమిది మంది మాజీ భారత నేవీ అధికారులను ఇజ్రాయెల్ కు గూఢచారులుగా పనిచేస్తున్నారనే అనుమానంతో అదుపులోకి తీసుకుంది. వీరిలో కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్ లు ఉన్నారు.
నేవీ మాజీల బెయిల్ పిటిషన్లను ఖతార్ అధికారులు పలుమార్లు తిరస్కరించారు. ఈ ఏడాది అక్టోబరులో ఖతార్ కోర్టు మరణశిక్షను ప్రకటించింది. కాగా.. గూడచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ నేవీ అధికారులందరూ భారత నావికాదళంలో 20 సంవత్సరాల వరకు విశిష్ట సేవలు అందించారు. నేవీలో వీరు బోధన అందించడంతో పాటు పలు ముఖ్యమైన పదవులను నిర్వహించారు.
కాగా.. అరెస్టయిన వారిలో ఒకరి సోదరి అయిన మీతు భార్గవ ఈ విషయంలో భారత ప్రభుత్వ సహాయాన్ని కోరింది. తన సోదరుడిని తిరిగి తీసుకురావడానికి సాయపడాలని అభ్యర్థించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆమె జూన్ 8న ప్రధాని నరేంద్ర మోడీకి ఓ పోస్టులో విజ్ఞప్తి చేశారు.
‘‘ఈ మాజీ నేవీ అధికారులు దేశానికి గర్వకారణం. మరింత ఆలస్యం చేయకుండా వారందరినీ వెంటనే భారతదేశానికి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని నేను మన ప్రధానిని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను’’ అని ఆమె ట్వీట్ చేశారు. ఆ పోస్టుకు ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లను ట్యాగ్ చేశారు.