కరోనా మహమ్మారిలాగే వేగంగా వ్యాపించే మరో ప్రాణాంతక వైరస్ మార్బర్గ్ ఆఫ్రికాలో నమోదైంది. ఈ వైరస్ సోకితే 100లో 80 మరణించే ముప్పు ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. వైరస్‌కు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని సూచించింది. మార్బర్గ్‌ను నియంత్రించడానికకి డబ్ల్యూహెచ్‌వో రంగంలోకి దిగింది.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కొత్త వేరియంట్లతో ప్రపంచాన్ని వణికిస్తుంటే మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్ మార్బర్గ్ కేసును గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. ఎబోలా ఫ్యామిలీకి చెందిన ఈ వైరస్ కరోనా వైరస్ తరహాలోనే వేగంగా వ్యాపించే ముప్పు ఉన్నదని స్పష్టం చేసింది. మార్బర్గ్ సోకితే 100 మందిలో 88 మంది మరణించే ముప్పు ఉందని హెచ్చరించింది. అందుకే ఆదిలోనే వైరస్‌కు అడ్డుకట్ట వేయాలని, లేదంటే విపత్కర పరిస్థితులు తప్పవని తెలిపింది. మార్బర్గ్ కూడా గబ్బిలాల్లో వ్యాపించే వైరస్ అని, వాటి నుంచే మనుషులకు సోకి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తొలి కేసు గుర్తింపు ఇలా..
గినియా దేశంలో ఈ కేసును గుర్తించారు. ఆగస్టు 2న మరణించిన ఓ వ్యక్తిలో మార్బర్గ్ వైరస్‌ను గుర్తించినట్టు గినియా ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. జులై 25వ తేదీ నుంచే ఆయన తీవ్ర జ్వరంతో బాధపడగా, స్థానిక క్లినిక్‌లలో చికిత్స పొందాడు. మలేరియాగా భావించి వైద్యులు చికిత్సనందించారు. ఆగస్టు 2న మరణించిన తర్వాత పోస్టుమార్టం రిపోర్టులో ఎబోలా నెగెటివ్ వచ్చినప్పటికీ మార్బర్గ్ పాజిటివ్‌గా వెల్లడైంది.
డబ్ల్యూహెచ్‌వో అలర్ట్
మార్బర్గ్ కేసుపై డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. ఈ వైరస్ దావానలంలా వేగంగా వ్యాపించే సామర్థ్యం గలదని, దీనికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని డబ్ల్యూహెచ్‌వో ఆఫ్రికా రీజనల్ డైరెక్టర్ డాక్టర్ మషిదిసో మోయెతీ అన్నారు. మార్బర్గ్ వైరస్ లాగే వ్యాపించే ఎబోలాను కట్టడి చేయడంలో సఫలమైన దేశ వైద్యులతో డబ్ల్యూహెచ్‌వో నిపుణులు బృందం కలిసి పనిచేస్తున్నదని వివరించారు. వేగంగా వ్యాపించే ముప్పు ఉన్నందున కాంటాక్ట్‌లపై ఫోకస్ పెట్టినట్టు చెప్పారు. ఈ వైరస్ మరణాల రేటు 88శాతం ఉండే అవకాశముందని అంచనా వేశారు.
మార్బర్గ్ వ్యాప్తి.. లక్షణాలు
మార్బర్గ్ వైరస్ సాధారణంగా రోసెట్టస్ గబ్బిలాల ఆవాసాల్లో కనిపిస్తుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. వాటి ఆవాసాలకు సమీపంగా వెళ్లిన వారికి సోకే ముప్పు ఉంటుందని వివరించింది. ఒకవేళ ఈ వైరస్ వాటి ద్వారా మనుషులకు సోకితే ఇతరులకు సులువుగా వ్యాపిస్తుందని తెలిపింది. మార్బర్గ్ సోకిన వ్యక్తి దేహం నుంచి విడుదలయ్యే ద్రవాల ద్వారా ఇతరులకు సోకవచ్చని, లేదా వారి ఉపయోగించిన వస్తువుల ద్వారా వ్యాపించవచ్చని వివరించింది. ఆగస్టు 2న మరణించిన వ్యక్తికి చెందిన ముగ్గురు కుటుంబీకులు, ఆయనకు చికిత్సనిచ్చిన హెల్త్‌కేర్ వర్కర్‌లను హైరిస్క్ కాంటాక్ట్‌లుగా పరిగణించి పర్యవేక్షిస్తున్నారు. మార్బర్గ్ వైరస్ సోకగానే ఉన్నపళంగా తీవ్ర జ్వరం, తీవ్ర తలనొప్పి, చికాకు కలుగుతుంది. దక్షిణాఫ్రికా, అంగోలా, కెన్యా, ఉగాండా, కాంగో దేశాల్లో మార్బర్గ్ కేసులు అత్యల్పంగా నమోదైనా నయమయ్యాయి. తాజాగా తొలిసారి వెస్ట్ ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్‌కు టీకాలు, చికిత్స లేకున్నా, ఆయా లక్షణాలకు ప్రత్యేకంగా చికిత్సనందించి పేషెంట్ ప్రాణాలు రక్షించే అవకాశముంది.
