భారతీయులకు పేడ ఎంత పవిత్రమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని రకాల దైవిక కార్యక్రమాల్లో పేడకు విశిష్ట స్థానం వుంది. భారత్‌లో ఆవు పేడ, పిడకలను ఎంతో పవిత్రంగా చూస్తారు. ఆవు పేడకు హానికారక సూక్ష్మజీవులను నాశనం చేసే గుణం ఉందని విశ్వసిస్తారు. పల్లెటూళ్లలో ఇప్పటికీ ఆవు పేడతో కళ్లాపిజల్లడంతో పాటు ఇంటిని ఆవు పేడతో అలుకుతారు

అయితే అమెరికా అధికారులుకు పిడకలన్నా, పేడ అన్నా విపరీతమైన భయం. అది ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (ఎఫ్ఎండీ)కి కారణమవుతుందన్న ఉద్దేశంతో భారత్‌ నుంచి ఆవు పిడకలను తీసుకురావడాన్ని ఫెడరల్ ప్రభుత్వం నిషేధించింది. ఎఫ్ఎండీ అనేది పశువులకు వచ్చే వ్యాధి. ఇది విస్తృతంగా, వేగంగా విస్తరించడమే కాకుండా పశు సంతతికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఫలితంగా వాటి యజమానులను నష్టాల్లోకి నెట్టేస్తుంది.

నిజానికి పిడకలను ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వంట చేసుకునేందుకు ఉపయోగిస్తారు. అంతేకాదు, దానిని యంటీ బ్యాక్టీరియల్‌గా, స్కిన్ డిటాక్సిఫయర్‌గా, ఎరువుగానూ ఉపయోగిస్తారు. పేడ నుంచి ఇన్ని ఉపయోగాలున్నప్పటికీ దీనివల్ల ఎఫ్ఎండీ వస్తుందని అమెరికా దీని రవాణాను నిషేధించింది.

ఎఫ్ఎండీకి సంబంధించి ఒక్క కేసు నమోదైనా ప్రపంచవ్యాప్తంగా పశు వాణిజ్యంపై తీవ్రమైన ప్రభావం పడటంతో పాటు వాణిజ్యం ఆగిపోతోంది. అమెరికాలో 1929 నుంచి ఇప్పటి వరకు ఎఫ్ఎండీకి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

తాజాగా, ఏప్రిల్ 4న వాషింగ్టన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ భారతీయుడి ప్రయాణికుడి సూట్‌కేసులో రెండు ఆవు పిడకల్ని గుర్తించారు అమెరికా అధికారులు. అంతే ఒక్కసారిగా ఎయిర్‌పోర్ట్ అంతా కలకలం రేగింది. వెంటనే రంగంలోకి దిగిన అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అగ్రికల్చర్ నిపుణులు వెంటనే వాటిని ధ్వంసం చేసేశారు.