Asianet News TeluguAsianet News Telugu

వ్యాక్సిన్ కోసం అల్లాడుతుంటే: అమెరికాలో ఫ్రిడ్జ్‌లలో మగ్గుతున్న టీకాలు

కరోనా వైరస్ వల్ల ఈ భూమీ మీద తీవ్రంగా నష్టపోయిన దేశం ఏదైనా వుంది అంటే అది అమెరికాయే. మరణాలు, కేసుల్లో అగ్రరాజ్యం అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే

covid 19 vaccines go idle as new york And florida ksp
Author
New York, First Published Jan 5, 2021, 2:24 PM IST

కరోనా వైరస్ వల్ల ఈ భూమీ మీద తీవ్రంగా నష్టపోయిన దేశం ఏదైనా వుంది అంటే అది అమెరికాయే. మరణాలు, కేసుల్లో అగ్రరాజ్యం అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉదాసీనత వల్ల లక్షలాది మంది అమెరికన్లు మూల్యం చెల్లించుకున్నారన్నది వాస్తవం.

ఈ క్రమంలో కోవిడ్‌ను కట్టడి చేయడంలో అమెరికాకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ పంపిణీ వేగంగా జరగకపోవడంతో టీకాల్లో అధికశాతం ఫ్రిడ్జ్‌ల్లోనే మగ్గిపోతున్నాయి.

ఇప్పటి వరకూ విడుదలైన టీకా డోసుల్లో దాదాపు 66 శాతం రెఫ్రిజిరేటర్లకు పరిమితమయ్యాయని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఫ్లోరిడా, న్యూయార్క్ రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండటంతో అక్కడి గవర్నర్లు అప్రమత్తమయ్యారు.

టీకా పంపిణీకి బాధ్యత వహిస్తున్న ఆస్పత్రుల పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్దతి మార్చుకోని వాటిపై జరిమానా విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. టీకాలు అందిన వారంలోపే వాటిని ప్రజలకు వేయాలి లేని పక్షంలో అవి జరిమానా కట్టాల్సి వస్తుందని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కుమో హెచ్చరించారు.

హాస్పిటల్స్‌కు టీకాల సంఖ్యను భవిష్యత్తులో తగ్గించాల్సి వస్తుందని చెప్పారు. న్యూయార్క్ ఆస్పత్రులు తమకు అందిన వాటిల్లో సగం కంటే తక్కువ టీకాలనే ప్రజలకు ఇచ్చినట్టు సమాచారం.

కాగా, అమెరికాలో ఫైజర్, మోడెర్నా టీకాలను అత్యవసర వినియోగానికి అక్కడి ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో పలువురికి అలర్జీ తదితర దుష్ప్రభావాలు కనిపించాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios