ఎక్స్‌ఈ వేరియంట్ పట్ల మన దేశంలోనూ ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో యూఎన్ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి నాలుగు నెలలకు ఒక సారి సగటున ఒక కొత్త వేరియంట్ పుట్టుకు వస్తున్నదని, కరోనా మహమ్మారి ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. ఆసియాలో కొన్ని దేశాల్లో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయని, ఐరోపాను కొత్త వేవ్‌లు చుట్టేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు 15 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలోనే పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని దేశాల్లోని ప్రతి పౌరుడికీ కరోనా టీకా వేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కొత్త వేరియంట్లు మరోసారి ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఆందోళనకారక కొత్త వేరియంట్లు పుట్టుకు రావడంతో.. వాటితో కరోనా కేసులు పెరుగుతుండటం పరిపాటిగా మారిపోతున్నది. ఈ నేపథ్యంలోనే యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసియాలో కేసులు భారీగా నమోదవుతున్నాయని వివరించారు. ఈ మహమ్మారి ఇప్పట్లో అంతం అయ్యే అవకాశాల్లేవని స్పష్టం చేశారు. యూరప్ మొత్తం కొత్త వేవ్‌లు చుట్టేస్తున్నాయని వివరించారు. ప్రతి రోజు ప్రపంచదేశాల్లో అన్ని కలిపి సుమారు 15 లక్షల కొత్త కేసులు రిపోర్ట్ అవుతున్నాయని తెలిపారు.

గావి కొవాక్స్ అడ్వాన్స్ మార్కెట్ కమిట్‌మెంట్ సమ్మిట్ 2022‌కు యూఎన్ చీఫ్ ఓ వీడియో సందేశం శుక్రవారం పంపారు. కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని, దానికి ఇంకా చాలా కాలం ఉన్నదనే విషయాన్ని ఈ సదస్సు స్వయంగా పేర్కొంటున్నదని వివరించారు. నేడు ప్రతి రోజు 15 లక్షల కొత్త కేసులు రిపోర్ట్ అవుతున్నాయని, యూరప్ మొత్తం కొత్త వేవ్‌లు చుట్టుముడుతున్నాయని పేర్కొన్నారు. కరోనా వైరస్ ఎంత వేగంగా మ్యుటేట్ చెందగలదో మనకు ఒమిక్రాన్ వేరియంట్ వెల్లడిస్తున్నదని వివరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ కరోనా టీకా అందించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.

కొన్ని అధిక ఆదాయ దేశాలు రెండో బూస్టర్ డోసు వేయడానికి సన్నాహాలు చేస్తుండగా చాలా దేశాలు అంటే.. మొత్తం మానవాళిలో మూడింట ఒకవంతు మందికి కనీసం ఒక్క డోసు కూడా ఇంకా పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని దారుణ స్థాయికి చేరుకున్న అసమానతను ఇది వెల్లడిస్తున్నదని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ అసమానతలే కొత్త వేరియంట్ల పుట్టుకకు పునాదిగా మారుతుందని వివరించారు. ఇలాంటివే మరణాలు పెరుగడానికి, తద్వార మానవ, ఆర్థిక సంక్షోభాలకు కారణంగా మారుతున్నాయని హెచ్చరించారు.

మరిన్ని కొత్త వేరియంట్లు రాకపోవని, అయితే, వస్తాయా? అనే సందేహం వద్దని, ఎప్పుడు వస్తాయి అనేదే ప్రశ్న అని వివరించారు. ఈ ఏడాది మధ్యలో కల్లా ప్రతి దేశంలో 70 శాతం మంది జనాభాకు టీకా వేయాలనే లక్ష్యాన్ని సాధించడం ఇప్పటికీ కష్టంగానే ఉన్నదని తెలిపారు. ప్రతి కొత్త వేరియంట్ సగటున నాలుగు నెలలకు ఓసారి పుట్టుకు వస్తాయని వివరించారు. అందుకే ప్రభుత్వాలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉన్నదని, తద్వారా ప్రతి వ్యక్తికీ టీకాలు అందించాలని తెలిపారు. కేవలం సంపన్న దేశాల్లోనే కాదు.. ఈ భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికీ టీకా అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన రెండు ఉప వేరియంట్లు బీఏ.1, బీఏ.2ల హైబ్రిడ్ వేరియంట్‌గా ఎక్స్‌ఈ వేరియంట్ పుట్టుకు వచ్చింది. ఇది తొలిసారి యూకేలో వెలుగులోకి వచ్చింది.