Asianet News TeluguAsianet News Telugu

సెకండ్ వేవ్‌లో తాట తీస్తోన్న కరోనా: 21 రోజుల్లోనే కోటి కేసులు.. 5 కోట్లు దాటిన సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ 5 కోట్ల మందికి పైగా సోకింది. గడచిన నెల రోజుల వ్యవధిలో పలు దేశాల్లో కరోనా రెండో వేవ్ ప్రారంభం కావడంతోనే కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. 

Coronavirus more than 5 crore cases worldwide ksp
Author
New Delhi, First Published Nov 13, 2020, 3:05 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ 5 కోట్ల మందికి పైగా సోకింది. గడచిన నెల రోజుల వ్యవధిలో పలు దేశాల్లో కరోనా రెండో వేవ్ ప్రారంభం కావడంతోనే కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది.

ఇక, గడచిన ఏడాది వ్యవధిలో అక్టోబర్ నెలలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అమెరికాలో అయితే, ఏకంగా రోజుకు లక్షకు పైగా కేసులు వస్తుండటం గమనార్హం. చాలా దేశాలు లాక్ డౌన్ నిబంధనలను సడలించడం, కరోనా నివారణకు ఇంతవరకూ వ్యాక్సిన్ రాకపోవడం కూడా కేసుల పెరుగుదలకు కారణమవుతోంది.

మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల నుంచి నాలుగు కోట్లకు పెరిగేందుకు 30 రోజుల సమయం పట్టగా, ఆపై 21 రోజుల వ్యవధిలోనే కేసులు మరో కోటి పెరిగి, ఐదు కోట్లకు చేరాయి. సగటున గత వారం రోజులుగా 5.40 లక్షల కొత్త కేసులు వస్తున్నాయి.

ఇక పలు దేశాల్లో కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉండటంతో, వారి అంత్యక్రియల నిర్వహణ సమస్యలను సృష్టిస్తోంది. ముఖ్యంగా రష్యా తదితర దేశాల్లో రహదారుల వెంట శ్మశానాలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆసుపత్రుల్లో బెడ్లు అందుబాటులో లేక, తాత్కాలిక కొవిడ్ సెంటర్లను పలు దేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. యూరప్ లో ఇప్పటికే 1.20 కోట్లకు పైగా కరోనా కేసులుండగా, మొత్తం మరణాల్లో 24 శాతం సంభవించాయి.

ప్రతి మూడు రోజులకూ యూరప్ దేశాల్లో 10 లక్షల వరకూ కొత్త కేసులు వస్తున్నాయంటే, పరిస్థితి ఎంత విషమిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇక అమెరికాలో డైలీ కేసుల సంఖ్య లక్షా 50లకు చేరువ అవుతోంది. గత 9 రోజుల నుంచి సగటున లక్ష కేసులు నమోదవుతున్నాయి.

యూరప్‌లోని ఫ్రాన్స్, యూకే, జర్మనీ తదితర దేశాల్లో ప్రతిరోజూ 20 వేల నుంచి 40 వేల కేసులు నమోదవుతున్నాయి. ఇక దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌లో ప్రతిరోజూ 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios