ఓ వైపు కరోనాతో భారత దేశం ఇక్కట్లు పడుతుంటే.. సరిహద్దుల్లో చైనా తన వక్రబుద్ధిని చూపిస్తూనే వుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరిహద్దుల్లో సైనికంగా బలపడుతోంది. సమన్వయంతో కూడిన గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకుంటోంది.

వాయు సేన కమాండ్‌లో సైన్యానికి చెందిన గగనతల రక్షణ విభాగాలను చేర్చింది. చైనా ఇటువంటి చర్య తీసుకోవడం ఇదే తొలిసారి. చైనా సైన్యానికి చెందిన ‘పీఎల్ఏ డైలీ’ మంగళవారం ఇందుకు సంబంధించిన కథనాన్ని ప్రచురించింది. 

పీఎల్ఏ డైలీ తెలిపిన వివరాల ప్రకారం, యుద్ధ సన్నాహాలపై దృష్టి పెట్టిన వెస్టర్న్ థియేటర్ కమాండ్‌లో ఈ కొత్త ఉమ్మడి వ్యవస్థను పీఎల్ఏ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఉమ్మడి గగనతల రక్షణ వ్యవస్థను పూర్తిగా ఉపయోగించుకోవడానికి ఇది దోహదపడుతుంది.

సమష్టి పోరాటం, ఉమ్మడి శిక్షణ కోసం తీసుకున్న నిర్ణయమని ప్రశంసించింది. ఈ కొత్త వ్యవస్థను ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు పేర్కొంది. అయితే ఆ పరిశీలన జరిగిన ప్రాంతం వివరాలను మాత్రం పీఎల్ఏ డైలీ బయటపెట్టలేదు. చైనా సైన్యం యుద్ధ సన్నద్ధతను తనిఖీ చేసేందుకు అత్యున్నత స్థాయి విన్యాసాలు నిర్వహించినట్లు తెలిపింది. 

వెస్టర్న్ థియేటర్ కమాండ్ చైనా-భారత్ సరిహద్దుల్లో రక్షణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది. పాక్షికంగా దళాల ఉపసంహరణ జరుగుతున్నప్పటికీ, చైనా గత ఏడాది ఈ ప్రాంతంలో తమ దళాలను పెద్ద మొత్తంలో మోహరించింది.

తూర్పు లడఖ్‌లో భారతదేశంతో ఘర్షణ నేపథ్యంలో భారీగా దళాలను మోహరించింది. అధికారిక సమాచారం ప్రకారం.. పీఎల్‌ఏ ఎయిర్ కమాండ్‌లోకి 10కి పైగా ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ యూనిట్లు చేరాయి.