చైనాలో ఓ వరుడు తన పెళ్లి వేదికకు బయటే కూర్చుని పెళ్లి తంతును తన సెల్‌ఫోన్‌లో లైవ్‌లో చూడాల్సి వచ్చింది. అక్కడ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుండటంతో వరుడి కరోనా నెగెటివ్ టెస్టు కాలం చెల్లిపోయింది. దీంతో మళ్లీ టెస్టు చేసుకుని రిపోర్టు కోసం వేచి చూస్తూ పెళ్లి వేదికకు బయటే ఉండిపోయాడు. తన పెళ్లికి అందరూ వచ్చినా.. తానే అటెండ్ కాలేక బయటతచ్చాడుతూ కనిపించాడు.
న్యూఢిల్లీ: పెళ్లికి ఎవరు వచ్చినా.. రాకపోయినా.. పెళ్లి ఆగదు. కానీ, పెళ్లికి వరుడు, వధువు మాత్రం కచ్చితంగా రావాల్సిందే. వాళ్లు లేకుండా పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. ఇది హాస్యంగా కనిపిస్తున్నా.. చైనాలో జరిగిన ఓ ఘటన చూస్తే ఇలా ఆలోచించకతప్పదు. చైనాలో తన పెళ్లి కోసం అన్నీ సిద్ధం అయ్యాక పెళ్లి కొడుకు వేదిక బయటే ఉండిపోవాల్సి వచ్చింది. తన పెళ్లిలో జరుగుతున్న కార్యక్రమాలను వేదిక బయటే కూర్చుని సెల్ ఫోన్‌లో చూడాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే?
చైనాలో జిన్‌జియాంగ్‌కు చెందిన వరుడు డేంగ్‌కు పెళ్లి కుదిరింది. ఈ నెల 26న పెళ్లికి ముహూర్తం ఖరారైంది. పెళ్లిని గ్రాండ్‌గా హోటల్‌లో ప్లాన్ చేసుకున్నారు. కరోనా కేసులు నమోదువుతున్నందున కొవిడ్ పీసీఆర్ టెస్టులను తప్పనిసరి చేశారు. పెళ్లి వేదిక వద్దకు రావాలంటే వధువు, వరుడు సహా అందరూ బంధువులు, ఆప్తులు, ఆహ్వానితులు తప్పకుండా కొవిడ్ పీసీఆర్ టెస్టు చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. కనీసం నాలుగు రోజులలోపు కరోనా టెస్టు చేసుకుని ఉండాలని, ఆ టెస్టులో నెగెటివ్ వస్తేనే వేదిక వద్దకు వారికి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశాయి.
హోటల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి ప్రారంభం అవ్వాల్సింది. కానీ, మధ్యాహ్నం 12 గంటలకు హోటల్ అధికారులకు చెప్పిన కండీషన్లు విని వారు షాక్ అయ్యారు. కొవిడ్ టెస్టు రిపోర్టు 48 గంటల్లోపుదే అయి ఉండాలని వారు షరతు చెప్పారు.
కానీ, వరుడి కరోనా నెగెటివ్ టెస్టు రిపోర్టు తీసుకుని అప్పటికే 48 గంటలు గడిచిపోయాయి. దీంతో ఆయనను తన పెళ్లి వేదిక వద్దకు వెళ్లడానికే హోటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆ పెళ్లి కొడుకు సమీపంలోని ఓ క్లినిక్ సెంటర్‌కు పరుగు పెట్టాల్సి వచ్చింది. మరోసారి తన కరోనా టెస్టు చేయించుకున్నాడు. ఆయనతోపాటు మరో 20 మంది గెస్టులు కూడా అదే కారణంగా మరోసారి కరోనా టెస్టులు చేయించుకోవాల్సి వచ్చింది.
దీంతో తన పెళ్లికి సెట్ చేసుకున్న టైం మించి పోతున్నా.. ఆ వరుడు చేసేదేమీ లేకపోయింది. కేవలం తన కరోనా టెస్టు రిపోర్టు కోసం ఎదురుచూస్తు ఆ హోటల్ బయటే కూర్చుండిపోయాడు. అయితే, ఆ హోటల్‌లో పెళ్లి వేదిక వద్ద జరుగుతున్న తంతును ఓ వ్యక్తి లైవ్ పెట్టి వరుడికి అందించాడు. ఆ హోటల్ బయట వరుడు ఆ లైవ్‌ను ఫోన్‌లో చూస్తూ మిగిలిపోయాడు.
హఠాత్తుగా జరిగిన ఈ పరిణామాలతో ముందుగానే వేదిక వద్దకు హాజరైన అతిథులు కాలం గడుస్తున్న కొద్దీ ఏం చేయాలో పాలుపోక టైం పాస్ కోసం ఎదురుచూశారు. అది గమనించి అతిథులను ఊరికే ఉంచడానికి బదులు.. పెళ్లి కూతురును వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఆమె తల్లి దండ్రులు పెళ్లి కూతురును వేదిక వద్దకు తెచ్చి అతిథులను ఉద్దేశించి గ్రీటింగ్స్ స్పీచ్ ఇచ్చారు. జరిగిన మార్పులను కూలంకుషంగా వివరించారు. వరుడు వేదిక వద్దకు వచ్చే వరకు అతిథులను ఊరికే ఉండటానికి బదులుగా ఆ సమయంలో
వారు విందు స్వీకరించాల్సిందిగా కోరారు. ఈ తంతు మొత్తం వరుడు బయట ఉండే చూడాల్సి వచ్చింది.
అయితే, తన టెస్టు రిపోర్టు వచ్చినాక సాయంత్రం 4.43 గంటలకు హోటల్ సిబ్బంది ఆ వరుడిని లోపటికి అనుమతించారు. చివరకు సాయంత్రం 6 గంటలకు వారి పెళ్లి జరిగింది. తనకు ఎదురైన అనుభవాన్ని వరుడు డేంగ్ సోషల్ మీడియాలో వివరిస్తూ వీడియో పెట్టాడు.
