చైనాలో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచం వణికిపోతుండగానే ఉత్తర చైనాలోని ఒక నగరంలో ప్లేగు వ్యాధి లక్షణాలతో ఒక కేసు నమోదయింది. ప్లేగ్ లక్షణాలు కనబడడంతో ఆసుపత్రి వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. 

ఇన్నర్ మంగోలియా స్వయం పరిపాలిత ప్రాంతంలోని బయన్నుర్ నగరంలో ఈ కేసు వెలుగుచూసింది. లెవెల్ 3 హెల్త్ వార్నింగ్ ను అధికారులు జారీ చేసారు. శనివారం నాడు ప్లేగ్ తరహా కేసు బయటపడిందని వెంటనే హెచ్చరికలను జారీ చేశామని, 2020 చివరివరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని అన్నారు అధికారులు. 

జులై 1వ తారీఖున పశ్చిమ మంగోలియా ప్రాంతంలో రెండు ప్లేగ్ కేసులు బయటపడ్డ విషయం తెలిసిందే. చైనా అధికారిక మీడియానే ఈ విషయాన్నీ ధృవీకరించింది. ఇప్పటికే అక్కడ ప్లేగ్ మహమ్మారి ప్రబలే ఆస్కారముందన్న హెచ్చరికలను ప్రభుత్వం జారీచేసింది. ప్లేగ్ బారిన ఇద్దరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు, ఎవరికీ లక్షణాలు ఉన్నట్టు అనుమానం ఉన్నా, సమీప ఆసుపత్రిలో రిపోర్ట్ చేయాలని వారు తెలిపారు. 

ఎలుకలు, పందికొక్కుల వల్ల ఈ బాక్టీరియా మనుషులకు సోకుతుంది. ఈగలయఁ వంటి కీటకాలు వాహకాలుగా పనిచేస్తాయి. ఈ బ్యుబోనిక్ ప్లేగ్ ఎంత ప్రమాదకారి అంటే.... సరైన చికిత్స అందించకపోతే 24 గంటల్లోనే మనిషి మరణించే ప్రమాదం ఉంది. 

పందుల ద్వారా సోకే మరో ప్రమాదకారి వైరస్ మహమ్మారిలా వ్యాపించే ఆస్కారముందని చైనా అధికారులు ప్రకటించి రెండు రోజులైనా కాకముందే ఇప్పుడు మరోసారి ప్లేగ్ వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. 

గత సంవత్సరం సైతం పచ్చి ఎలుకల మాంసం ని తినడం వల్ల చైనాలోని ఒక జంట ప్లేగ్ వల్ల మరణించిన విషయం తెలిసిందే. అక్కడ పచ్చి మాంసాలను తింటుండడం వల్ల ఈ బాక్టీరియా మరింతగా, మరింతమందికి వ్యాపించే ఆస్కారం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

ఇకపోతే.... కరోనా మహమ్మారి రోజు రోజుకీ వికృత రూపం దాలుస్తోంది. భారత్ లో ఈ వైరస్  ప్రభావం పెరిగిపోతోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త  కోవిడ్ కేసులు నమోదౌతున్నాయి.  ఇక తాజాగా నమోదైన కేసులతో భారత్ రష్యాను అధిగమించి అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో మూడో స్థానానికి చేరింది. 

రష్యాలో ఇప్పటివరకు 6,81,251 కరోనా కేసులు నమోదుకాగా.. భారత్‌లో 6,95,396 కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికా, బ్రెజిల్ తరువాతి స్థానంలో ఇప్పుడు భారతదేశం నిలిచింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ విషయంలో భారత్ మూడో స్థానానికి చేరుకుంది.