Asianet News TeluguAsianet News Telugu

భారతీయ టీకాలు నమ్మదగినవి: ఎట్టకేలకు ఒప్పుకున్న చైనా

కరోనాపై భారత్ పోరాటం , వ్యాక్సిన్ తయారీపై చివరిగా స్పందించిన దేశం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా చైనాయే. తాజాగా చైనా ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ లో ఇటీవల ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. పరిశోధన , ఉత్పత్తి సామర్థ్యం పరంగా భారత్ టీకాలు చైనా వేరియంట్ కంటే తక్కువ పోటీని కలిగి ఉండవని సూచించాయి

China forced to admit that Indian vaccines are trustworthy ksp
Author
Beijing, First Published Jan 10, 2021, 10:31 PM IST

కరోనాపై భారత్ పోరాటం , వ్యాక్సిన్ తయారీపై చివరిగా స్పందించిన దేశం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా చైనాయే. తాజాగా చైనా ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ లో ఇటీవల ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. పరిశోధన , ఉత్పత్తి సామర్థ్యం పరంగా భారత్ టీకాలు చైనా వేరియంట్ కంటే తక్కువ పోటీని కలిగి ఉండవని సూచించాయి. అలాగే భారత్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద ఔషద తయారీదారుగా అభివర్ణించింది. 

భారతీయ వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా నమ్మదగినవని అంగీకరించింది నివేదిక. ఇదే సమయంలో కొంతకాలం క్రితం భారత్ బయోటెక్ సంస్థను సందర్శించిన జిలిన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌కు చెందిన జియాంగ్ చున్లై భారతదేశానికి చాలా పరిణతి చెందిన ఉత్పత్తి, సరఫరా సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. 

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను కలిగి ఉందని చెప్పారు. ఈ సంస్థ ఉత్పత్తి, సరఫరా సామర్ధ్యం పాశ్చాత్య దేశాల కంటే కూడా బలంగా ఉందని అని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది..

భారతీయ వ్యాక్సిన్ తయారీదారులు డబ్ల్యూహెచ్‌వో, గావి, దక్షిణ అమెరికాలోని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (PAHO) తో సహా పలు ప్రపంచ సంస్థలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారని తెలిపింది. అవి దశాబ్దాల క్రితం తమ నమ్మకాన్ని సంపాదించుకున్నాయని వెల్లడించిందని జియాంగ్ అన్నారు. భారతీయ వ్యాక్సిన్ తయారీదారులు టీకా అభివృద్ధి , నియంత్రణలో పాశ్చాత్యదేశాల ప్రమాణాలకు అనుగుణంగా వుండటం వల్ల ఎగుమతులకు తోడ్పడ్డాయి.

ప్రపంచంలోని అతిపెద్ద కరోనా వైరస్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం మొదటి దశను భారత్ ప్రారంభించటానికి కొద్ది రోజుల ముందు చైనా అధికారికంగా భారత్‌ శక్తి సామర్ధ్యాలను అంగీకరించడం విశేషం. పండుగ సీజన్ తరువాత జనవరి 16న కోవిషీల్డ్ , కోవాక్సిన్ అనే రెండు టీకాలను దేశ ప్రజలకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 

మూడు కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది(వైద్యులు, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌, పోలీసులు అదేవిధంగా మహమ్మారిపై పోరాటంలో ప్రత్యక్షంగా ఉన్న వారికి) మొదటి ప్రాధాన్యతగా వాక్సినేషన్‌ను అందించనున్నారు. వీరి అనంతరం 50 ఏళ్ల పైబడిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తొలి విడతలో మొత్తం 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ జరగనుంది.  

భారతదేశం ఇప్పటికే వ్యాక్సినేషన్‌కు సంబంధించి మూడు డ్రై రన్‌లు నిర్వహించింది. ఈ సమయంలో 61,000 మంది ప్రోగ్రామ్ మేనేజర్లు, 2 లక్షల వ్యాక్సినేటర్లు, 3.7 లక్షల వ్యాక్సినేషన్ బృందాలకు శిక్షణ ఇవ్వబడింది.

సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ వ్యాక్సిన్లపై భారత్ తన విశ్వాసాన్ని తెలియజేయడంతో ఇతర దేశాలు కూడా ఆర్డర్‌లు ఇస్తున్నాయి. మహమ్మారి నుంచి మానవాళిని రక్షించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ నొక్కిచెప్పారు. శనివారం జరిగిన ప్రవాసి భారతీయ దివాస్ కార్యక్రమంలో ప్రవాసులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ రోజు, భారతదేశం ఒకటి కాదు రెండు 'మేడ్ ఇన్ ఇండియా' కరోనా వ్యాక్సిన్లతో మానవాళిని రక్షించడానికి సిద్ధంగా ఉందన్నారు. 

భారతదేశం గతంలో ప్రపంచంలోని ప్రతి నిరుపేదలకు అవసరమైన మందులను పంపిణీ చేసిందని, ఇప్పటికీ చేస్తూనే ఉందని మోడీ గుర్తుచేశారు. ఈ రోజు భారతదేశం టీకా కోసం ప్రపంచం వేచి ఉండటమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని భారతదేశం ఎలా నడుపుతుందో ఆసక్తిగా చూస్తోందని మోడీ తెలిపారు.

నేపాల్ ఇప్పటికే భారతీయ వ్యాక్సిన్లపై ఆసక్తిని వ్యక్తం చేసింది. ఇక 30 మిలియన్ డోసుల వ్యాక్సిన్ల కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు భూటాన్, మయన్మార్ కూడా భారతదేశం నుండి వ్యాక్సిన్ ఎగుమతి చేసుకునేందుకు సిద్ధంగా వున్నాయి. మొత్తం మీద టీకా దౌత్యం ఈ ప్రాంతంలో భారతదేశ ప్రతిష్టను పెంచుతుందని చైనా నిపుణులు అభిప్రాయపడ్డారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios