పొగాకు వినియోగంతో కేన్సర్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిగరెట్లపై ‘‘పొగాకు పొగ పిల్లలకు హాని చేస్తుంది’’, ‘‘సిగరెట్లు లుకేమియాకు కారణమవుతాయి’’, ‘‘ప్రతి పఫ్‌లో విషం’’ అనే సందేశాలను ఉంచేందుకు కెనడా సిద్దమైంది.

పొగాకు వినియోగంతో కేన్సర్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిగరెట్లపై ‘‘పొగాకు పొగ పిల్లలకు హాని చేస్తుంది’’, ‘‘సిగరెట్లు లుకేమియాకు కారణమవుతాయి’’, ‘‘ప్రతి పఫ్‌లో విషం’’ అనే సందేశాలను ఉంచేందుకు కెనడా సిద్దమైంది. కెనడాలో త్వరలోనే ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలలో ఈ సందేశాలు కనిపించనున్నాయి. ప్రతి ఒక్క సిగరెట్‌పై నేరుగా ఆరోగ్య హెచ్చరికలను ముద్రించాలని కెనడా బుధవారం ప్రకటించింది. తద్వారా అలా చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలిచింది. 

‘‘కొత్త పొగాకు ఉత్పత్తుల స్వరూపం, ప్యాకేజింగ్, లేబులింగ్ నిబంధనలు.. ధూమపానం చేసే పెద్దలు మానేయడానికి, యువతను. పొగాకు రహిత వినియోగదారులను నికోటిన్ వ్యసనం నుండి రక్షించడానికి, పొగాకు ఆకర్షణను మరింత తగ్గించడానికి కెనడా ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఉంటుంది’’ అని కెనడియన్ ఆరోగ్య అధికారులు ఒక వార్తా ప్రకటనలో తెలిపారు.

2035 నాటికి దేశవ్యాప్తంగా పొగాకు వినియోగాన్ని 5 శాతం కంటే తక్కువకు తగ్గించాలనే కెనడా లక్ష్యంలో ఈ నియంత్రణ భాగంగా చెబుతున్నారు. పొగాకు ఉత్పత్తుల ప్యాకేజీలపై ఆరోగ్య సందేశాలను బలోపేతం చేయడంతో సహా దేశంలో ధూమపానం చేసేవారి సంఖ్యను తగ్గించడానికి ఉద్దేశించిన ఇతర చర్యలతో పాటు ఇది కూడా చేరుతుందని ఆరోగ్య అధికారులు తెలిపారు.

‘‘పొగాకు వినియోగం కెనడాలో అత్యంత ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యలలో ఒకటిగా కొనసాగుతోంది. వ్యాధి, అకాల మరణాలకు దేశంలోని ప్రధాన కారణం పొగాకు వాడకం’’అని ఆరోగ్య మంత్రి జీన్-వైవ్స్ డుక్లోస్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘కెనడియన్లు, ముఖ్యంగా యువకుల ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడటానికి మా ప్రభుత్వం మా వద్ద ఉన్న ప్రతి సాక్ష్యం-ఆధారిత సాధనాన్ని ఉపయోగిస్తోంది’’ అని పేర్కొన్నారు. 

ఇక, కొత్త నియమాలు ఆగస్టు 1 నుండి అమలులోకి రానున్నాయి. అయితే అవి దశలవారీగా అమలు చేయబడతాయి. పొగాకు ఉత్పత్తుల ప్యాకేజీలను విక్రయించే రిటైలర్లు 2024 ఏప్రిల్ చివరి నాటికి కొత్త హెచ్చరికలను కలిగి ఉండాలి. కింగ్-సైజ్ సిగరెట్‌లు మొదట 2024 జూలై చివరి నాటికి వ్యక్తిగత హెచ్చరికలను కలిగి ఉంటాయి. 2025 ఏప్రిల్ చివరి నాటికి సాధారణ-పరిమాణ సిగరెట్లు, ఇతర ఉత్పత్తులను నిబంధనలను అనుసరిస్తాయని కెనడ ప్రభుత్వ వార్తా ప్రకటన తెలిపింది.