Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై దాడిని కొన‌సాగిస్తున్న ర‌ష్యా పై క‌ఠిన ఆంక్షలు విధించాల‌నీ.. యుద్ధం ఆపేందుకు చర్యలు తీసుకోవాలని భార‌త్ స‌హా ప‌లు దేశాల‌కు ఉక్రెయిన్ విజ్ఞ‌ప్తి చేసింది. ఉక్రెయిన్‌లో విదేశీ పౌరులు ఉన్న దేశాల సానుభూతిని పొందేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. 

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతూనే ఉంది. వేలాది మంది ప్రాణాలు పోవ‌డానికి.. ల‌క్ష‌లాది మంది నిరాశ్ర‌యులు కావ‌డానికి కార‌ణ‌మ‌వుతున్న ర‌ష్యాపై మ‌రిన్ని క‌ఠిన‌ ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా.. ప్ర‌పంచ దేశాలను కోరారు. భారత్‌తో సహా ప్ర‌పంచ దేశాల ప్రభుత్వాలు ప్ర‌స్తుతం కొనసాగుతున్న ఈ సంఘర్షణను ఆపేందుకు రష్యాకు విజ్ఞప్తి చేయాలని పిలుపునిచ్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కులేబా.. రష్యా కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. విదేశీ విద్యార్థులతో సహా పౌరులను ఖాళీ చేయడానికి కాల్పులు నిలిపివేయాలని కోరారు.

"30 సంవత్సరాలుగా, ఉక్రెయిన్ ఆఫ్రికా, ఆసియా నుండి వేలాది మంది విద్యార్థులకు స్వాగతించే నివాసంగా ఉక్రెయిన్ ఉంది... వారి (విదేశీ విద్యార్థుల) త‌ర‌లింపును సులభతరం చేయడానికి, ఉక్రెయిన్ రైళ్లను ఏర్పాటు చేసింది, హాట్‌లైన్‌లను ఏర్పాటు చేసింది, రాయబార కార్యాలయాలతో కలిసి పనిచేసింది... పౌరుల ర‌క్ష‌ణ కోసం ఉక్రెయిన్ ప్రభుత్వం ఉత్త‌మంగా ప‌ని చేస్తోంది" అని చెప్పారు. ఉక్రెయిన్‌లో విదేశీ పౌరులు ఉన్న దేశాల సానుభూతిని పొందేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. విదేశీ విద్యార్థుల సమస్యను రష్యా మానిప్యులేట్ చేయ‌డం ఆపివేస్తే, వారందరినీ సురక్షితంగా ఖాళీ చేయిస్తారని ఆయన అన్నారు. "నేను భారతదేశం, చైనా మరియు నైజీరియా ప్రభుత్వాలను కోరుతున్నాను.. ఈ యుద్ధాన్ని ఆపివేయాడానికి.. పౌరుల‌ను త‌ర‌లించ‌డానికి ర‌ష్యాతో మాట్లాడాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌ని" చెప్పారు. 

ఇంకా, రష్యాతో ప్రత్యేక సంబంధాలను కలిగి ఉన్న భారతదేశంతో సహా అన్ని దేశాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఈ యుద్ధం అందరి ప్రయోజనాలకు విరుద్ధం అని విజ్ఞప్తి చేయవచ్చని కులేబా చెప్పారు. ఆయా దేశాలు ఈ ర‌ష్యా దాడుల‌ను ఆపేందుకు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ వివాదానికి ముగింపు అన్ని దేశాలకు మేలు చేస్తుందని వాదిస్తూ..ఉక్రేనియన్ వ్యవసాయ ఉత్పత్తుల అతిపెద్ద వినియోగదారులలో భారతదేశం ఒకటి మరియు ఈ యుద్ధం కొనసాగితే, కొత్త పంటలకు విత్తనాలు వేయడం మాకు కష్టమవుతుంది. కాబట్టి, ప్రపంచ మరియు భారతీయ ఆహార భద్రత పరంగా కూడా ఈ యుద్ధాన్ని ఆపడం ఉత్తమం అని పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపాలని రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని సాధారణ భారతీయులకు ఆయన పిలుపునిచ్చారు. "ఉక్రెయిన్ మాపై దాడి చేసినందున మాత్రమే పోరాడుతోంది మరియు పుతిన్ ఉనికిలో ఉన్న మన హక్కును గుర్తించనందున మేము మా భూమిని రక్షించుకోవాలి" అని అన్నారు. 

మానవతా కారిడార్‌లను ఏర్పాటు చేసేందుకు కుదిరిన ఒప్పందాన్ని రష్యా దళాలు ఉల్లంఘించినందున మానవతా కారిడార్లు మరియు కాల్పుల విరమణలు లేవని కులేబా పేర్కొన్నారు. "విదేశీ విద్యార్థులతో సహా పౌరులను ఖాళీ చేయడానికి అనుమతించడానికి కాల్పులు నిలిపివేయాలని మేము రష్యాను కోరుతున్నాము" అని తెలిపారు. రష్యా దాడులతో ఉక్రెయిన్ పరిసరాలు గుర్తుపట్టరాకుండా.. శిథిళాల దిబ్బలా కొన్ని ప్రాంతాలు మారాయి. ఇదిలావుండ‌గా, భార‌త్ ఆపరేషన్ గంగా కింద 63 విమానాల ద్వారా ఉక్రెయిన్ నుండి భారీగా సంఖ్య‌లో పౌరుల‌ను స్వ‌దేశానికి తీసుకువ‌చ్చింది. ఇంకా ఆపరేషన్ గంగా కొనసాగుతోంది.