కందీల్ బలోచ్ పాక్‌లో సెల్ఫీ స్టార్‌గా ఫేమస్ అవ్వడంతో ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే బలోచ్ ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో పాటు వీరి వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది.

ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె సోదరుడు మహ్మద్ వసీం 2016 జూలైలో కందీల్‌ను గొంతు నులిమి హత్యచేశాడు. దీంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని పరువు హత్యగా కేసు నమోదు చేశారు.

మీడియా సమావేశంలో మాట్లాడిన వసీం.. తన సోదరిని చంపినందుకు ఏమాత్రం బాధపడటం లేదన్నాడు. ఆమె అసభ్య ప్రవర్తన కారణంగానే బలోచ్‌ను అంతమొందించానని పేర్కొన్నాడు.

ఈ నేపథ్యంలోనే సుధీర్ఘ విచారణ అనంతరం ముల్తాన్‌లోని న్యాయస్థానం వసీంకు జీవితఖైదు విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. దీనిపై వసీం తరపు న్యాయవాది మాట్లాడుతూ... తన క్లైంట్‌ను స్థానిక కోర్టు దోషిగా తేల్చినప్పటికీ.. హైకోర్టులో అతనికి న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

కాగా..  పాక్‌ చట్టాల ప్రకారం సమీప బంధువును హత్య చేసిన కేసులో నిందితుడైన వ్యక్తికి బాధితుల బంధువుల నుంచి క్షమాభిక్ష పొంది నేరం నుంచి తప్పించుకునే వీలుండేది. దీంతో అక్కడ పరువు హత్యలు ఎక్కువయ్యాయి.

అయితే బలోచ్‌కు సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఆమెను హత్య చేసిన వారికి శిక్ష పడాలని నెటిజన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో పరువు హత్యలకు పాల్పడే వారికి జీవితఖైదు విధించేలా పాకిస్తాన్ పార్లమెంట్ చట్టాన్ని రూపొందించింది.