బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా స్ట్రెయిన్ ప్రపంచదేశాలకు అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్‌ ఇప్పటికే 41 దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

కోవ్‌-202012/01గా వ్యవహరిస్తున్న కొత్త రకం కరోనా జనవరి 5 నాటికి 40దేశాలు/ప్రాంతాలకు విస్తరించిందని తెలిపింది. అలాగే దక్షిణాఫ్రికాలో బయటపడ్డ 501.V2 రకం వైరస్‌ ఆరు దేశాలకు వ్యాపించింది’ అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.  

సార్స్‌కోవ్‌-2తో పోలిస్తే బ్రిటన్‌ రకం కరోనా 70 శాతం వేగంగా వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇప్పటికే కరోనాతో అష్టకష్టాలు పడుతున్న ఆయాదేశాలు కొత్త స్ట్రెయిన్‌తో ఉలిక్కిపడ్డాయి.

అప్రమత్తమైన ప్రపంచదేశాలు బ్రిటన్‌కు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అయితే, బ్రిటన్‌ రకం వైరస్‌ కాకుండా ఇప్పటి వరకు మొత్తం నాలుగు రకాల కరోనా వైరస్‌లు బయటపడినట్లు ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. వీటిలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన రకంతో పాటు అంతకు ముందు వచ్చిన d614g రకం కూడా ఉన్నాయి.  

మరోవైపు యూకే వైరస్ మనదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు 71 మందికి స్ట్రెయిన్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం వీరందరినీ ఆయా రాష్ట్రాలు ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షిస్తున్నాయి.

వారితో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా క్వారంటైన్‌లో ఉంచాయి. అటు కొత్తరకం కేసుల కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను కూడా కొనసాగుతుండడంతోపాటు వైరస్‌ సోకిన వారి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కూడా చేపడుతున్నామని కేంద్రం వెల్లండించింది.