Asianet News TeluguAsianet News Telugu

ప్రిన్స్ ఆండ్రూ మిలిటరీ హోదాలను తొలగించిన క్వీన్ ఎలిజబెత్.. ‘లైంగిక నేరారోపణలను వ్యక్తిగతంగా ఎదుర్కొంటాడు’

బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూపై అమెరికాలోని కోర్టులో లైంగిక నేరారోపణలతో లా సూట్ దాఖలైంది. 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రిన్స్ ఆండ్రూ తనపై పలుసార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడని వర్జీనియా జిఫ్రె అందులో ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ప్రిన్స్ ఆండ్రూ ఖండించారు. తనపై దాఖలైన లా సూట్‌ను తోసిపుచ్చాలని కోర్టును కోరారు. కానీ, కోర్టుకు అందుకు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ప్రిన్స్ ఆండ్రూ తల్లి క్వీన్ ఎలిజబెత్ ఆయనకు ఉన్న రాచరిక హోదాలను, మిలిటరీ ర్యాంకులను తిరిగి వెనక్కి తీసుకుంటున్నట్టు నిర్ణయించింది. ఆయన ఈ కేసును వ్యక్తిగతంగానే ఎదుర్కొంటాడని బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటించింది.
 

britain prince andrew stripped of military titles amid sexual abuse case to trial
Author
New Delhi, First Published Jan 13, 2022, 11:48 PM IST

న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ లైంగిక నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు. అమెరికా కోర్టులో ఆయనపై ఓ మహిళ ఈ ఆరోపణలతో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ విచారించడానికి కోర్టు అంగీకరించింది. ప్రిన్స్ ఆండ్రూ తరఫు న్యాయవాదులు పిటిషనర్‌పై రాయల్ కుటుంబీకులు ఎవరూ లైంగిక దాడికి పాల్పడలేదని, ఆ ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ, ఆ పిటిషన్ డిస్మిస్ చేయాల్సిందిగా వారు చేసిన వాదనలు కోర్టు న్యాయమూర్తిని కన్విన్స్ చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే క్వీన్స్ ఎలిజబెత్ తన రెండో కొడుకు ప్రిన్స్ ఆండ్రూకు మిలిటరీ హోదాలు అన్నింటినీ తొలగించడానికి నిర్ణయం తీసుకున్నట్టు బకింగ్‌హాం ప్యాలెస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు, చారిటీల నుంచీ ఆయనను తొలగించింది. ఈ నేరారోపణలను ఆయన కేవలం తన వ్యక్తిగతంగా మాత్రమే ఎదుర్కొంటాడని స్పష్టం చేసింది.

బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ మిలిటరీ హోదాలను ఆయన తల్లి రెండో ఎలిజబెత్ తొలగించారు. ఓ మైనర్ బాలికపై ఆయన లైంగికదాడికి పాల్పడ్డాడని అమెరికాలోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అమెరికాకు చెందిన ఫైనాన్షియర్, సెక్స్ అఫెండర్ జెఫ్రీ ఎప్‌స్టెన్ నిర్బంధంలో ఉన్న 17 ఏళ్ల బాలికతో ప్రిన్స్ ఆండ్రూ సెక్స్ చేశాడని ఆ పిటిషన్ నేరారోపణలు చేస్తున్నది. తాను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రిన్స్ ఆండ్రూ తనపై లైంగికదాడి చేశాడని వర్జీనియా జిఫ్రె ఆ పిటిషన్‌లో ఆరోపించారు. జెఫ్రీ ఎప్‌స్టెన్‌తో ప్రిన్స్ ఆండ్రూకు పరిచయాలు ఉన్నాయి. ఈ ఆరోపణలతో తనకు సంబంధం లేదని ప్రిన్స్ ఆండ్రూ వాటిని కొట్టి పారేశారు. వర్జీనియా జిఫ్రెతో తాను ఎన్నడూ కలువలేదని అన్నారు. మన్‌హటన్ ఫెడరల్ కోర్టులో తనపై దాఖలైన లా సూట్‌ను తోసిపుచ్చాల్సిందిగా కోర్టును కోరారు. ఇందుకు న్యాయమూర్తులు అంగీకరించలేదు.

ఈ నేపథ్యంలోనే బ్రిటన్ నావికా దళం, వాయు దళం, ఆర్మీలోని సుమారు 150 మంది వెటరన్స్ .. క్వీన్ ఎలిజబెత్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. సెక్స్ అఫెండర్ కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తూ మరణించిన జెఫ్రి ఎప్‌స్టెన్‌తో ప్రిన్స్ ఆండ్రూ సంబంధాలను నెరపడంపై వారు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పటికీ పలు సైనిక ర్యాంకులు, హోదాలు కలిగి ఉండటంపై తాము కలత చెందుతున్నట్టు పేర్కొన్నారు. రాయల్ నేవీ వైస్ అడ్మైరల్ సహా పలు మిలిటరీ ర్యాంకులను కలిగి ఉండటాన్ని వ్యతిరేకించారు. ఈ లేఖ రాసిన తర్వాత క్వీన్ ఎలిజబెత్ ప్రిన్స్ ఆండ్రూకు ఉన్న అన్ని రాయల్ హోదాలను, ర్యాంకులను తొలగించారు. ఆయన తనపై మోపిన లైంగిక నేరారోపణలను ఒక ప్రైవేటు సిటిజన్‌గా ఎదుర్కొంటారని బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటన తెలిపింది.

వర్జీనియా జిఫ్రెతో జెఫ్రీ ఎప్‌స్టెన్‌ 2008లో ఓ ఒప్పందం చేసుకున్నాడని, జెఫ్రీ ఎప్‌స్టెన్‌తో సంబంధమున్న ప్రిన్స్ సహా ఇతరులపై లైంగిక నేరారోపణలు చేయరాదనే అంగీకారం ఉన్నదని ప్రిన్స్ ఆండ్రూ తరఫు న్యాయవాదులు వాదించారు.

Follow Us:
Download App:
  • android
  • ios