అఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని గురుద్వారలో రెండు బాంబు పేలుళ్లు జరిగాయి. తుపాకుల కాల్పులూ జరిగాయి. ఈ ఘటనలో గురుద్వార గార్డుతోపాటు ఒక సిక్కు మరణించారు. మరికొందరు ఇంకా గురుద్వారలో చిక్కుకుని ఉన్నట్టు సమాచారం. 

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లే అధికారం చేపడుతున్నా.. ఉగ్రవాదుల పేలుళ్లు తగ్గడం లేదు. తాజాగా, హిందూ, సిక్కులను టార్గెట్ చేసుకుని రెండు పేలుళ్లు జరిగాయి. దేశ రాజధాని కాబూల్‌లో రద్దీగా ఉండే కార్తె పర్వాన్ ఏరియాలోని గురుద్వారలో రెండు పేలుళ్లు జరిగాయి. తుపాకుల కాల్పులు కూడా వినిపించినట్టు తెలిసింది. ఇందులో ఇద్దరు మరణించారు. కాగా, పలువురు ఇంకా ఆ గురుద్వారలోనే చిక్కుకుని ఉన్నట్టు తెలుస్తున్నది.

కార్తె పర్వాన్‌లోని గురుద్వార దశ్మేష్ పితా సాహిబ్ జీ రెండు గేట్ల వద్ద పేలుళ్లు జరిగాయని స్థానిక మీడియా పేర్కొంది. పేలుళ్లు జరిగినప్పుడు గురుద్వారలో చాలా మంది భక్తులు ఉన్నట్టు సమాచారం. అయితే, అందులో నుంచి పలువురు తప్పించుకుని బయటపడ్డారు. వారిని సమీప హాస్పిటల్‌కు తరలించారు. అయితే, ఇంకా ఎంత మంది ఆ గురుద్వారలోనే చిక్కుకున్నారనే విషయం తెలియదు.

కాబూల్‌లోని ఈ గురుద్వార గేట్ల వద్ద ఉదయం 7 గంటలకు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఒక సిక్కూ, మరొకరు సెక్యూరిటీ గార్డుగా ఉన్న ముస్లిం వ్యక్తి మరణించినట్టు తెలిసింది. ఈ ఏరియా జనసమ్మర్ధంగా ఉంటుంది. ఈ ఏరియాలో మెజార్టీగా అఫ్ఘనిస్తాన్ హిందూ, సిక్కులు ఎక్కువగా ఉంటారు. 

ఈ ఘటనపై బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ, గురుద్వార నుంచి ముగ్గురు బయటకు వచ్చారని, వారిని హాస్పిటల్ తీసుకెళ్లారని వివరించారు. అందులో ఒకరు గురుద్వార గార్డు మరణించాడని తెలిపారు. బుల్లెట్ల గాయాలతో ఆ గార్డు మరణించినట్టు తెలిపారు. కాగా, ఇంకా గురుద్వారలో ఏడు నుంచి ఎనిమిది మంది చిక్కుకుని ఉంటారని వివరించారు.

ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ఘటన దిగ్భ్రాంతికరం అని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. కాబూల్‌లోని పవిత్ర గురుద్వారలో పేలుళ్లు జరిగినట్టు వార్తలు వస్తున్నాయని తెలిపారు. గురుద్వారపై జరిపిన పిరికిపంద చర్యను అందరూ ఖండించాలని అన్నారు. దాడి గురించిన సమాచారం అందినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలను తాము దగ్గరగా పరిశీలిస్తున్నామని వివరించారు. అక్కడి కమ్యూనిటీ గురించి తాము ఆందోళన చెందుతున్నామని తెలిపారు.

అయితే, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.