కొవిడ్-19తో తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవలే 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని తీసుకువచ్చారు.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. అందులో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉందనే చెప్పాలి. గతేడాది అక్కడ కరోనా కేసులు మిలియన్లకు పైగా నమోదయ్యాయి. చనిపోయిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీని కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిన్నది.
కొవిడ్-19తో తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవలే 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని తీసుకువచ్చారు. అది కూడా అధికారంలోకి వచ్చిన కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ భారీ ఉద్దీపన ప్యాకేజీని తీసుకొచ్చే ఉభయ సభల్లో గెలిపించుకోవడం విశేషం.
తాజాగా బైడెన్ మరో భారీ ప్యాకేజీ ప్రకటించారు. ఈసారి మౌలిక సదుపాయాల రంగానికి ఊతమిచ్చేలా ఈ ఉద్దీపన ప్యాకేజీ తీసుకొస్తున్నట్లు బుధవారం వెల్లడించారు. వచ్చే ఎనిమిదేళ్లలో మౌలిక రంగ అభివృద్ధికి 2.3 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు.
దీనిని 'ఒక తరంలో ఒకసారి వెచ్చించే పెట్టుబడి'గా అధ్యక్షుడు పేర్కొన్నారు. అలాగే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దేశంలో అతి పెద్ద ఉద్యోగాల కల్పన పెట్టుబడి కూడా ఇదేనని బైడెన్ తెలిపారు. ఇక ఈ ఉద్దీపన ప్యాకేజీ ద్వారా సుమారు 621 బిలియన్ డాలర్లు రవాణా రంగం అభివృద్ధికి(వంతెనలు, రహదారులు, రోడ్ల పునరుద్ధరణ, విమానాశ్రయాల ఆధునీకరణ, విద్యుత్ వాహనాలకు) వినియోగిస్తామని ప్రకటించారు.
అలాగే 400 బిలియన్ డాలర్లు వృద్ధులు, వికలాంగ అమెరికన్ల సంరక్షణకు కేటాయించారు. మరో 300 బిలియన్ డాలర్లు తాగునీటి మౌలిక సదుపాయాలు, బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్‌ను విస్తరించడం, ఎలక్ట్రిక్ గ్రిడ్‌లను అప్‌గ్రేడ్ చేయడలాంటి వాటికి ఉపయోగించనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా బైడెన్ కీలక ప్రతిపాదన చేశారు. కార్పొరేట్ పన్నును 21 శాతం నుంచి 28 శాతానికి పెంచనున్నట్లు ప్రకటించారు.
