Asianet News TeluguAsianet News Telugu

ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా నెతన్యాహు ప్రమాణ స్వీకారం .. ప్రధాని మోదీ అభినందనలు

ఇజ్రాయెల్ కొత్త ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇజ్రాయెల్‌లో ఎక్కువ కాలం  ప్రధాన మంత్రిగా పనిచేసిన 73 ఏళ్ల నెతన్యాహు.. తన నాయకత్వంలో ఆరవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో బెంజమిన్ నెతన్యాహు ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. భారతదేశం, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. 

Benjamin Netanyahu sworn-in as Israel's new Prime Minister
Author
First Published Dec 30, 2022, 3:36 AM IST

ఇజ్రాయెల్ ప్రధానిగా లికుడ్ పార్టీ అధినేత బెంజమిన్ నెతన్యాహు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. 73 ఏళ్ల నెతన్యాహు ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్‌లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా ఘనత సాధించారు. అతడు నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పలు వామపక్ష పార్టీలు మద్దతు పలికాయి. వీటిలో ఓట్జ్మా యెహుడిట్, యునైటెడ్ తోరా జుడాయిజం, రిలిజియస్ జియోనిస్ట్ పార్టీ , నోమ్ ఉన్నాయి. నెతన్యాహు గతంలో 14 ఏళ్ల పాటు ప్రధానిగా వ్యవహరించారు. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెతన్యాహు.. ఇజ్రాయెల్ పార్లమెంట్ 'నెస్సెట్'లో విశ్వాస తీర్మానాన్ని కూడా గెలుచుకున్నారు. 

మీడియా కథనాల ప్రకారం.. మొత్తం 120 మంది ఎంపీల్లో 63 మంది నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా ఓటు వేశారు. 54 మంది ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. పీఎం నెతన్యాహు తన కేబినెట్‌లో 31 మంది మంత్రులు, ముగ్గురు డిప్యూటీ మంత్రులను నియమించారు. రక్షణ, విద్య, సంక్షేమ మంత్రిత్వ శాఖలో ఇద్దరు చొప్పున మంత్రులను నియమించారు. తన మంత్రివర్గంలో ఐదుగురు మహిళలను కూడా చేర్చుకున్నారు. 

ప్రమాణ స్వీకారానికి ముందు.. నెతన్యాహు తన ప్రభుత్వానికి మూడు జాతీయ లక్ష్యాలను నిర్దేశించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం, దేశంలో బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌ను నిర్మించడం మరియు మరిన్ని అరబ్ దేశాలను అబ్రహం ఒప్పందాల పరిధిలోకి తీసుకురావడం తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా దేశ పౌరుల భద్రతను మెరుగుపరుస్తామని, ద్రవ్యోల్బణం తగ్గిస్తామని నెతన్యాహు హామీ ఇచ్చారు.

నెతన్యాహు ప్రసంగం సమయంలో.. ప్రతిపక్ష సభ్యులు అతనిని "బలహీనమైన", "జాత్యహంకార" విమర్శలు చేసుకుంటూ.. సభను బహిష్కరించారు.. గందరగోళం మధ్య నెతన్యాహు మాట్లాడుతూ.. “ఓటర్ల ఆదేశాన్ని గౌరవించండి. ఇది ప్రజాస్వామ్యం లేదా దేశం అంతం కాదు.” దేశ పౌరుల వ్యక్తిగత భద్రతను మెరుగుపరుస్తామని, పెరుగుతున్న జీవన వ్యయాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చారు.

ప్రధాని మోదీ అభినందనలు

కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బెంజమిన్ నెతన్యాహును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. భారతదేశం, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

నెతన్యాహు కూటమికి 64 సీట్లు 

దాదాపు నాలుగేళ్లలో ఐదు ఎన్నికల తర్వాత నవంబర్ 1న జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో నెతన్యాహు మరియు అతని మిత్రపక్షాలు 120 సీట్లలో 64 స్థానాలను గెలుచుకున్నాయి. నెతన్యాహు ప్రభుత్వంలో జాతీయ భద్రతా మంత్రి అవుతారని భావిస్తున్న అతివాద రాజకీయ నాయకుడు ఇటమార్ బెన్-గ్విర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు లికుడ్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios