Asianet News TeluguAsianet News Telugu

సైకిల్ పై తండ్రిని కూర్చోబెట్టుకొని 1200 కిలోమీటర్లు.... బాలికపై ఇవాంకా ప్రశంసలు!

బీహార్ కి చెందిన ఒక 15 సంవత్సరాల బాలిక గాయపడ్డ తన తండ్రిని సైకిల్ మీద కూర్చోపెట్టుకొని వారం రోజులపాటు తొక్కుతూ 1200 పైచిలుకు కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామానికి తీసుకొని వెళ్ళింది. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

Beautiful feat : Ivanka Trump Responds To Bihar girl cycling 1,200 km with father
Author
New Delhi, First Published May 23, 2020, 10:18 AM IST

కరోనా వైరస్ దెబ్బకు విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా తమ వారికి దూరంగా ఎక్కడో చిక్కుబడిపోయిన వలస కార్మికుల దీనగాథలను మనం ఎన్నో చూసాము, ఇంకా చూస్తూనే ఉన్నాము కూడా. 

చాలామంది వలస కూలీలు కాలినడకన, సైకిళ్ళ మీద ఇలా ఏది అందుబాటులో ఉంటె... దానిమీద వేల కిలోమీటర్ల దూరంలోని తమ సొంతూర్లకు పయనమయ్యారు. ఇలా కొందరు వలస కూలీలు తాము నడుచుకుంటూ, గాయపడ్డ తమ కుటుంబ సభ్యులను మోసుకుంటూ వెళ్తున్న సందర్భాలను కూడా మనము చూసాము. 

ఇలానే బీహార్ కి చెందిన ఒక 15 సంవత్సరాల బాలిక గాయపడ్డ తన తండ్రిని సైకిల్ మీద కూర్చోపెట్టుకొని వారం రోజులపాటు తొక్కుతూ 1200 పైచిలుకు కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామానికి తీసుకొని వెళ్ళింది. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

తండ్రిపై ఉన్న అసమాన ప్రేమను చూపెట్టిన ఆ బాలికను ఎవ్వరు కూడా ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కూడా ఆ అమ్మాయిని మెచ్చుకుంటూ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది. 

"15 సంవత్సరాల జ్యోతి కుమారి 1200 పైచిలుకు కిలోమీటర్ల దూరం గాయపడ్డ తండ్రిని సైకిల్ పై ఎక్కించుకొని తొక్కింది. ఆ అమ్మాయి చూపెట్టిన ప్రేమ, ఓర్పు భారతీయ ప్రజలందరినే కాకుండా సైక్లింగ్ ఫెడరేషన్ ని కూడా ఆకట్టుకుంది" అని ట్వీట్ చేసారు. 

బీహార్ కు చెందిన జ్యోతి కుమారి తండ్రితో కలిసి గురుగ్రామ్ లో నివసిస్తున్నారు. ఆమె తండ్రి అక్కడే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల ఆ వ్యక్తి అక్కడ పని దొరలక్క ఖాళీగా మారాడు. దీనితో ఇబ్బంది పడుతూ జీవనం సాగించేకంటే... అక్కడి నుండి వెళ్లి ఊరిలో జీవించొచ్చు అనుకున్న ఆ తండ్రి కూతుళ్లు ఇంటికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. 

బయట రవాణా సదుపాయం ఏది లేకపోవడంతో, తమ పాత సైకిల్ నే ఆశ్రయించారు. తండ్రి అనారోగ్యంతో ఉండడం చూసి, జ్యోతి తానే సైకిల్ తొక్కడానికి పూనుకుంది. ఇలా వారం రోజులపాటు 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ తమ సొంతఊరికి తండ్రితోపాటు చేరుకుంది. 

ఆమె ఇలా 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న సైక్లింగ్ ఫెడరేషన్ ఆ బాలికను మెచ్చుకొని ట్రయల్స్ కి రావలిసిందిగా ఆహ్వానించింది. ఆ ట్రయల్స్ లో గనుక జ్యోతి సక్సెస్ అయితే... ఆమెకు ఫుల్ ట్రైనింగ్ ఇవ్వనుంది సైక్లింగ్ ఫెడరేషన్. 

Follow Us:
Download App:
  • android
  • ios