ఒకే కాన్పులో ఇద్దరు, ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు పుట్టిన సంగతి మనకు తెలిసిందే. కానీ.. ఒక బిడ్డకు జన్మనిచ్చిన నెలలోపే మరో ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడం గురించి ఎప్పుడైనా విన్నారా..? ఇలాంటి విచిత్ర సంఘటన బంగ్లాదేశ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  బంగ్లాదేశ్ కి చెందిన ఆరీఫా సుల్తానా(20) గత నెల ఫిబ్రవరి 5వతేదీన  ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నార్మల్ డెలివరీలో ఓ మగ బిడ్డ జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె బిడ్డను తీసుకొని ఇంటికి కూడా వెళ్లిపోయింది. అయితే.. డెలివరీ జరిగిన 26  రోజులకు ఆమెకు మళ్లీ నొప్పులు మొదలయ్యాయి.

వెంటనే ఆస్పత్రికి తీసుకురాగా.. ఆమె కడుపులో మరో ఇద్దరు బిడ్డలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే ఆమెకు సీజేరియన్ చేసి ఆ ఇద్దరు బిడ్డలను సురక్షితంగా బయటకు తీశారు. అయితే మొదటి కాన్పులో ఆమెకు రెండో గర్భాశయం ఉన్నట్లు డాక్టర్లు గుర్తించలేదు. మొదట నార్మల్‌ డెలివరీ కాగా, రెండోసారి సీజేరియన్‌ చేశారు. 

రెండో డెలివరీలో ఒక బాబు, ఒక పాప పుట్టారు. ఇలాంటి ఘటనలు అరుదుగా చోటు చేసుకుంటాయని గైనకాలజిస్ట్‌ పొద్దార్‌ తెలిపారు. మొదటి డెలివరీ తర్వాత ఆమె కడుపులో ఇద్దరు బిడ్డలు ఉన్నట్లు ఆమె గుర్తించలేదని వైద్యలు చెప్పడం విశేషం. తన 30ఏళ్ల సర్వీసులో ఇలాంటి అరుదైన కేసు ఇప్పటి వరకు చూడలేదని వైద్యులు తెలిపారు ముగ్గురు పిల్లలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. 

ఆరిఫా భర్త కూలీ పని చేస్తూ నెలకు రూ. 6 వేలు సంపాదిస్తాడు. ఈ చిన్న సంపాదనతో తన భార్య, ముగ్గురు పిల్లలను మంచిగా చూసుకుంటానని, ఇది అల్లా ఇచ్చిన వరమని భర్త సుమోన్‌ బిస్వాస్‌ పేర్కొన్నారు.