Brazil Rains: ఈశాన్య బ్రెజిల్‌లో భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 57 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గల్లంతు అయ్యారు. ప్రస్తుతం తుఫాను ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు.
Heavy Rains In Northeastern Brazil: బ్రెజిల్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో డజన్ల కొద్ది మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గల్లంతయ్యారు. ఈశాన్య బ్రెజిల్‌లో కుండపోత వర్షాల కారణఃగా కనీసం 57 మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి స్థానిక మీడియా నివేదించింది. అలాగే, వందల మంది తప్పిపోయారని బ్రెజిల్ సర్కారు వెల్లడించింది. వదర ముప్పులో చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు వేల మంది సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చారు. "భారీ వర్షాల కారణంగా 57 మంది మరణించారు.. అధికారికంగా 56 మంది తప్పిపోయారు.. మరో 25 మంది గాయపడ్డారు.. 3,957 మంది వరద నీటి ముంపు ప్రాంతంలో ఉన్నారు. 533 మంది స్థానభ్రంశం చెందారు" అని ప్రాంతీయ అభివృద్ధి మంత్రి డేనియల్ ఫెరీరా తీవ్రంగా దెబ్బతిన్న ఈశాన్య పెర్నాంబుకో రాష్ట్ర రాజధాని రెసిఫేలో విలేకరుల సమావేశంలో అన్నారు.
బ్రెజిల్‌లో విపరీతమైన వాతావరణం కారణంగా ఇటీవల సంభవించిన ఘోరమైన కొండచరియలు విరిగిపడటం, వరదలు ముంచెత్తిన ఘటనల్లో ఇది తాజాది. శనివారం నుండి వరదల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగి.. 33 కు చేరింది. ఆదివారం నాటికి వరదల్లో మరణించిన వారి సంఖ్య 57కు పైగా చేరింది. భారీ వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహించాయి. ఎక్కడ చూసిన బురద ప్రవాహాలు.. రోడ్డు మార్గాలను కప్పివేశాయి. కొండచరియలు విరిగిపడిన బురద ప్రవాహం కారణంగా దాదాపు 28 మంది ప్రాణాలు కోల్పోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించినా ఉదయానికి తుపాను తగ్గుముఖం పట్టింది. ప్రతికూల వాతావరణం కాస్త సద్దుమనగడంతో దాదాపు 1,200 మంది సిబ్బంది శోధన మరియు రెస్క్యూ పనిని పునఃప్రారంభించారనీ, ప్రజల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామనీ, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఫెరీరా అన్నారు.
ప్రస్తుతం వర్షాలు ఆగిపోయినప్పటికీ రానున్న కొద్ది రోజులు భారీ వర్షాలు కురుస్తాయని బ్రెజిల్ వాతావరణ విభాగం అంచనా వేసిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాబట్టి మొదటి విషయం స్వీయ-రక్షణ చర్యలను నిర్వహించడం కొనసాగించాలని తెలిపింది. కాగా, రిసిఫ్ మరియు జబోటావో డోస్ గ్వారారేప్స్ మునిసిపాలిటీ మధ్య సరిహద్దులో, ప్రమాదకరంగా నిర్మించిన ఇళ్లలో కొండచరియలు విరిగిపడి శనివారం ఉదయం 19 మంది మరణించారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో ఆదివారం మాట్లాడుతూ.. ఈ మహా విషాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను సోమవారం రెసిఫేకి వెళ్తానని చెప్పారు. కాగా, గత సంవత్సరంలో కూడా కుండపోత వర్షాల వల్ల సంభవించిన వరదలు మరియు కొండచరియలు విరిగిపడటం వల్ల వందలాది మంది బ్రెజిలియన్లు మరణించారు.
